చదివింది 12.. అకౌంటెంట్‌గా రూ. వెయ్యి కోట్ల బోగస్‌ బిల్లులు జారీ! మొత్తానికి చిక్కాడు

26 Jan, 2022 19:55 IST|Sakshi

వెయ్యి కోట్ల రూపాయలకు బోగస్‌ బిల్లులు జారీ చేయడంతో పాటు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌  కింద 181 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


27 ఏళ్ల వయసున్న ఆ నిందితుడి పేరు, ఇతర వివరాలను వెల్లడించని పోలీసులు.. సదరు వ్యక్తి 12వ తరగతి వరకు మాత్రమే చదివాడని మాత్రం చెప్పారు. అకౌంటెంట్‌గా, జీఎస్టీ కన్సల్టెంట్‌గా ఈ భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ముంబై జోన్‌ పాల్‌ఘడ్‌ సీజీఎస్‌టీ కమిషనరేట్‌ అధికారులు వెల్లడించారు. 

డేటా మైనింగ్, డేటా విశ్లేషణ ఆధారంగా అందిన నిర్దిష్ట ఇన్‌పుట్‌లతో అధికారులు తీగను లాగారు.  M/s నిథిలన్ ఎంటర్‌ప్రైజెస్ ‘గూడ్స్‌ లేదా సేవల’ రసీదు లేకుండా నకిలీ ఇన్‌వాయిస్‌లను జారీ చేయడంతో నకిలీ ITCని పొందడం లాంటి విషయాలు అధికారుల దృష్టికి రావడంతో ఈ డొంక అంతా కదిలింది. 

అంతేకాదు తన క్లయింట్లలోని ఓ వ్యక్తి ఐడెంటిటీ ద్వారా నిందితుడు జీఎస్టీ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం అతన్ని అరెస్ట్‌ చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది కోర్టు. దీనివెనుక పెద్ద ముఠా ఉందని అనుమానిస్తున్న పోలీసులు.. ముఠా నెట్‌వర్క్‌ను చేధించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు