మహమ్మారిలా వ్యాపిస్తున్న డీప్ ఫేక్.. మొన్న రతన్ టాటా.. నేడు నారాయణ మూర్తి

14 Dec, 2023 20:39 IST|Sakshi

డీప్ ఫేక్ అనేది కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలను కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఇప్పటికే రతన్ టాటా పేరుమీద వచ్చిన డీప్ ఫేక్ మరువక ముందే.. మరో పారిశ్రామిక దిగ్గజం మీద డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల డీప్ ఫేక్ వీడియో బారిన పడినట్లు తెలిసింది. ట్రేడింగ్‌ యాప్‌లకు నారాయణ మూర్తి ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్లు కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

ట్రేడింగ్‌ యాప్‌లలో నేను పెట్టుబడులు పెట్టానని, వాటిని ప్రచారం చేస్తున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలోప్రచారమవుతున్నాయి. వాటిని ఎవరూ నమ్మవద్దని నారాయణ మూర్తి పేర్కొన్నారు. కొన్ని వెబ్‌సైట్లు డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి మోసం చేస్తున్నాయని, అలాంటివి మీకు ఎదురైతే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలనీ పేర్కొన్నారు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్‌లో, సోన అగర్వాల్ పేరుతో టాటా మేనేజర్‌గా చెప్పుకుంటూ.. దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం, దీని కోసం ఈ ఛానెల్‌లోకి వెళ్లండి అంటూ.. రతన్ టాటా చెప్పినట్లు ఓ పోస్ట్ షేర్ చేశారు. 

ఈ వీడియోపై రతన్ టాటా స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయనే వెల్లడించారు.

 

>
మరిన్ని వార్తలు