వ్యాపారాలకు జోరుగా రుణాలివ్వాలి

27 Feb, 2021 04:55 IST|Sakshi

స్టార్టప్‌లకు అనువైన ఆర్థిక సాధనాలు రూపొందించాలి

బ్యాంకులకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా రికవరీ బాట పట్టించే దిశగా వ్యాపార సంస్థలకు మరింతగా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే, ఫిన్‌టెక్, స్టార్టప్‌ సంస్థలకు అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం అయినప్పటికీ.. బడుగు వర్గాలకు తోడ్పాటు అందించడం కోసం బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగడం అవసరమని మోదీ చెప్పారు. ఆర్థిక సేవలకు సంబంధించి బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. కోవిడ్‌–19 కష్టకాలంలో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలతో 90 లక్షల పైగా ఎంఎస్‌ఎంఈలకు దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు లభించాయని ఆయన చెప్పారు.

‘ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లను ఆదుకోవడం, వాటికి రుణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. వ్యవసాయం, బొగ్గు, అంతరిక్షం తదితర రంగాల్లో ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇక గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, స్వావలంబన భారత లక్ష్యాన్ని సాధించడంలో వారిని కూడా భాగస్వాములను చేసేందుకు తగు విధమైన తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఆర్థిక రంగంపైనే ఉంది‘ అని ప్రధాని తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో రుణ లభ్యత కూడా కీలకంగా మారుతోంది. కొత్త రంగాలు, కొత్తగా వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణ సదుపాయాన్ని ఎలా అందించాలన్న దానిపై ఆర్థిక సంస్థలు దృష్టి పెట్టాలి. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్‌ సంస్థల కోసం కొత్తగా, మెరుగైన ఆర్థిక సాధనాల రూపకల్పనపై కసరత్తు చేయాలి‘ అని సూచించారు.
 

చిన్న రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ తోడ్పాటు..
చిన్న రైతులు, పాడి రైతులు మొదలైన వారు అసంఘటిత వడ్డీ వ్యాపారుల చెర నుంచి బైటపడటానికి కిసాన్‌ క్రెడిట్‌ ఎంతగానో తోడ్పడిందని మోదీ చెప్పారు. ఇలాంటి వర్గాల వారి కోసం వినూత్నమైన ఆర్థిక సాధనాలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రైవేట్‌ రంగం పరిశీలించాలని సూచించారు. ఆర్థిక సేవల రంగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, దీన్ని మరింత పటిష్టంగా.. క్రియాశీలకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు