NASA: అంతరిక్షంలో ‘ఘాటు’ ప్రయోగం.. నాలుగు నెలల్లో పంట చేతికి!

20 Jul, 2021 10:19 IST|Sakshi

అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్‌ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది.  

15,000 వేలకోట్ల అమెరికన్‌ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్‌ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్‌ రకానికి చెందిన మేలైన హట్చ్‌ రకపు మిరప గింజలు ఈ జూన్‌లో స్పేస్‌ ఎక్స్‌ కమర్షియల్‌ సర్వీస్‌ ద్వారా స్పేస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్‌ కిమ్‌బ్రాగ్‌ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్‌ ఓవెన్‌ సైజులో ఉండే ‘సైన్స్‌ క్యారియర్‌’ అనే డివైజ్‌లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది.

 
వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్‌లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్‌ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్‌ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది.

>
మరిన్ని వార్తలు