సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు

23 Nov, 2023 20:47 IST|Sakshi

ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ చేయడానికి ఒక దర్శకుడికి రూ.91 కోట్లు చెల్లించింది. కానీ అతడు స్టాక్‌మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి దాదాపు రూ.50 కోట్లు నష్టపోయినట్లు గురువారం కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే..

2018లో నెట్‌ఫ్లిక్స్ కార్ల్‌రిన్చ్‌ అనే దర్శకుడి నుంచి ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ను కొనుగోలు చేసింది. 2020 నాటికి ఆ సిరీస్‌ కోసం రూ.366 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సరిపోలేదని మరింత కావాలని రిన్చ్‌ అడగడంతో నెట్‌ఫ్లిక్స్‌ రూ.91 కోట్లు ఇచ్చింది. కానీ ఆ డబ్బును ఫార్మాస్టాక్స్‌లో ఆప్షన్‌ ట్రేడింగ్‌ చేసి రూ.50 కోట్లు నష్టపోయాడు. అయితే మిగతా రూ.33 కోట్లను డోజికాయిన్‌ అనే క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్‌చేసి రూ.220 కోట్లు సంపాదించినట్లు సమాచారం. తర్వాత తాను ఖరీదైన ఐదు రోల్స్‌రాయిస్‌ కార్లు, ఒక ఫెరారీ కారు, ఫర్నీచర్, డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసినట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.

2021లో బయోటెక్ సంస్థకు చెందిన గిలియడ్ సైన్సెస్ షేర్లు పెరుగుతాయని రిన్చ్‌ పందెం వేసినట్లు కొన్ని కథనాలు ద్వారా తెలిసింది. తాజాగా అమెరికా మార్కెట్‌ ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్ మరింత పడిపోతుందని ఆప్షన్‌ ట్రేడింగ్‌ చేసి కొన్ని వారాల వ్యవధిలోనే తాను రూ.50 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. తాజా ఘటనపై నెట్‌ఫ్లిక్స్ తన ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వడం మానేసి రిన్చ్‌‌పై దావా వేయనుందని సమాచారం.

ఇదీ చదవండి: అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక

ఇదిలాఉండగా కార్ల్‌రిన్చ్‌ గతంలో కేవలం ‘47 రొనిన్‌’ అనే ఒకే సినిమా రూపొందించడం గమనార్హం. ఈ మొత్తం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రిప్లైలు వైరల్‌గా మారుతున్నాయి. రిన్చ్‌ జీవితంపైనే మంచి సినిమా తీయచ్చని కొందరు, తాను స్కామ్‌ చేశాడని ఇంకొందరు పోస్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు