ఉద్యోగులు బరువు తగ్గితే.. బోనస్‌ ఇస్తానంటున్న సీఈవో

8 Apr, 2022 16:26 IST|Sakshi

స్టార్టప్‌ నుంచి యూనికార్న్‌ కంపెనీగా ఎదిగిన జెరోదా ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించింది. వరల్డ్‌ హెల్త్‌డేని పురస్కరించుకుని ఉద్యోగల మధ్య ఆసక్తికర పోటీకి ఆ కంపెనీ సీఈవో నితిన్‌ కామత్‌ తెర తీశారు. గతంలో ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు రూ. 10 లక్షలు బోనస్‌ అందించాడు నితిన్‌ కామత్‌.

జెరోదా కంపెనీ ఫౌండర్‌ కమ్‌ సీఈవో నితిన్‌ కామత్‌ ఆది నుంచి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. తాజాగా ఆ కంపెనీ ఉద్యోగుల మధ్య విచిత్రమైన పోటీ పెట్టారు. ఏ ఉద్యోగి బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 25 కంటే తక్కువగా ఉంటుందో వాళ్లకి సగం నెల జీతం బోనస్‌గా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం తమ కంపెనీ ఉద్యోగుల సగటు బీఎంఐ 25.3గా ఉందని, దీన్ని 24 కిందకు తీసుకువస్తే ఉద్యోలందరికీ అర నెల జీతం బోనస్‌గా ఇస్తానంటూ కొత్త రకం కాంపిటీషన్‌ ప్రారంభించారు.

ఆర్యోగంగా ఉంటే మిగిలిన అన్ని సాధించవచ్చు. అయితే ఫిట్‌గా ఉండేందుకు వర్కట్లు ప్రారంభించడమే కష్టమైన పని. అందుకే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కి సంబంధించి బీఎంఐ అనేది అంత శ్రేష్టమైన కొలమానం కాకపోయినప్పటికీ.. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది తేలికైన విధానం. ఈ కారణం చేతనే బీఎంఐ పోటీ పెడుతున్నట్టు నితిన్‌ కామత్‌ వివరణ ఇచ్చారు. అంతకాదు రోజు పది వేల అడుగుల నడకతో మీ పోటీని ప్రారంభించండంటూ ఉద్యోగులకు సూచించాడు.

నితిన్‌ కామత్‌ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఉద్యోగులు శ్రద్ధ తీసుకునేలా మోటివేట్‌ చేయడం మంచి నిర్ణయమని కొందరు సానుకూలంగా స్పందించారు. మరికొందరు ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుందని.. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల చివరికి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు

చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన జెరోదా..!

మరిన్ని వార్తలు