Elon Musk క్లారిటీ: బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు ఎంతో తెలుసా?

2 Nov, 2022 09:40 IST|Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, టెస్లా సీఈవో, ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్‌  బ్లూటిక్‌ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు.  మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌లో యూజర్లు తమ బ్లూటిక్‌ను నిలుపుకోవాలన్నా, కొత్తగా బ్లూటిక్‌ కావాలన్నా ఇక చెల్లింపులు  చేయాల్సిందే.  నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.700) చెల్లించాల్సి ఉంటుందని ట్విటర్‌ ఏకైక డైరెక్టర్‌ మస్క్ మంగళవారం  ప్రకటించారు. 

దేశంలోని కొనుగోలు శక్తి ప్రకారం ధరలను సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు బ్లూటిక్‌ యూజర్లు అదనపు ప్రయోజనాలు పొందుతారని ముఖ్యంగా స్పామ్, స్కామ్‌ల నుంచి తప్పించుకోవడానికి అవసరమైన రిప్లైలు పొందడంలో ప్రాధాన్యత, ప్రస్తావనలు, సెర్చ్‌లో ప్రాధాన్యత లభిస్తుందని మస్క్ ప్రకటించారు. అంతేకాదు పెద్ద వీడియోను, ఆడియోను కూడా పోస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు తమతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణ కర్తలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇలా వచ్చే ఆదాయం కంటెంట్ క్రియేటర్ల చెల్లింపులకు తోడ్పడు తుందని కూడా మస్క్‌  ట్వీట్‌ చేశారు

కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తక్షణమే మస్క్‌ అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌ఓ నెడ్ సెగల్ , పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పునరుద్ధరిస్తున్నానని చెప్పిన మస్క్‌,  నెలకు 20 డాలర్ల ఫీజును వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత  డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి ప్రస్తుతం ట్విటర్ ఏకైక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా బ్లూటిక్‌ ఫీజును నెలకు 8 డాలర్లుగా నిర్ణయించారు. అయితే ఈ బ్లూటిక్‌ బాదుడుపై చాలామంది యూజర్లు అసంతృప్తితో ఉన్నారు.

>
Poll
Loading...
మరిన్ని వార్తలు