ఇక దేశమంతటా పెట్రోల్​ బంకుల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు!

9 Nov, 2021 17:57 IST|Sakshi

ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతుండటంతో ఈవీ ఇన్​ఫ్రా సెక్టార్‌‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దేశమంతటా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలను మొదలుపెట్టాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్), మరో రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాబోయే 3-5 ఏళ్లలో 22,000 ఎలక్ట్రిక్ వేహికల్(ఈవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ ఐఓసీఎ రాబోయే మూడేళ్లలో 10,000 ఇంధన అవుట్ లెట్లలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) రాబోయే ఐదేళ్లలో 7,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) కూడా 5,000 స్టేషన్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. 2021 సీఓపీ26 వాతావరణ మార్పు సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం 2070 నాటికి ఉద్గారాలను సున్నాకు తగ్గించనున్నట్లు వివరించారు. అలాగే, భారతదేశం తన తక్కువ కార్బన్ శక్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు(జిడబ్ల్యు) పెంచాలని, 2030 నాటికి తన మొత్తం శక్తి అవసరాలలో 50 శాతం తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

(చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇంత తక్కువ ధరకా!)

మరిన్ని వార్తలు