ఆ విషయంలో ప్రధాని మోదీ కంటే నేనే తోపు!

4 May, 2022 17:58 IST|Sakshi

గత కొంత కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓలా స్కూటర్లకు సంబంధించి భవీశ్‌ అగర్వాల్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. అయితే ఈ ట్రోలింగ్‌లో నిజమైన వాటి కంటే కేవలం తనపై దుష్‌ప్రచారం చేసేందుకు కార్పొరేట్‌ వరల్డ్‌ చేస్తున్నదే ఎక్కువగా ఉందంటున్నాడు భవీశ్‌ అగర్వాల్‌.

మోదీకి మించి
సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై భవీశ్‌ అగర్వాల్‌ స్పందించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోవర్లతో పోల్చితే అతి తక్కువగా నాకు ఫాలోవర్లు ఉన్నారు. అయినా సరే నేను ఏదైనా విషయం చెప్పడం ఆలస్యం ప్రధాని మోదీ కంటే కూడా ఎక్కువ రియాక‌్షన్లు వస్తున్నాయి.  అవన్నీ కూడా కాపీ పేస్ట్‌ చేసిన నెగటీవ్‌ కామెంట్స్‌తో కూడినవే ఉంటున్నాయి. ఇండియాలోని కార్పోరేట్‌ ప్రపంచంలో ఓలాపై దారుణంగా ట్రోలింగ్‌ ఎటాక్‌ జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు భవీశ్‌ అగర్వాల్‌.

ట్రోల్‌ ఎటాక్‌
ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల డేటాను ప్రస్తావిస్తూ... ఏప్రిల్‌లో అత్యధిక ఈవీ స్కూటర్లు అమ్మిన సంస్థగా ఓలా రికార్డు సృష్టించిందని పేర్కొంటూ తమ కాంపిటీటర్స్‌ తమపై దృష్టి పెట్టడం కాకుండా వాళ్ల పనితీరు మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ పెడితే మంచిందంటూ ట్వీట్‌ చేశాడు. మరుసటి రోజు ఏకంగా ప్రధాని మోదీతో పోల్చుతూ సోషల్‌ మీడియాలో ఓలా, తాను ఎంతగా ట్రోల్‌కు గురువుతున్నామో ఉదహారించాడు భవీశ్‌.

అనతి కాలంలోనే
ఓలా స్కూటర్లు అనతి కాలంలోనే దేశంలో నంంబర్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్రాండ్‌గా ఎదిగింది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అయితే ఓలా స్కూటర్‌ లాంచింగ్‌ సందర్భంగా పేర్కొ‍న్న ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు స్కూటర్‌ కోసం లక్ష రూపాయలకు పైగా నగదు చెల్లించినా డెలివరీ నెలల తరబడి ఆలస్యం అవుతోంది. వీటికి తోడు డెలివరీ అయిన స్కూటర్లకు ఏదైనా సమస్య తలెత్తితే కస్టమర్‌ సపోర్ట్‌ పొందడం చాలా కష్టంగా మారుతోంది.

అవే ఆయుధాలు
ఓలా స్కూటర్ల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కస్టమర్లు నేరుగా ట్వీటర్‌లో భవీశ్‌ అగర్వాల్‌ను ట్యాగ్‌ చేస్తూ తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఓలా ప్రత్యర్థులు ఈ సమస్యలనే ఆయుధంగా చేసుకుని ఆ కంపెనీపై దాడి చేస్తున్నారు. దీంతో ఓ రేంజ్‌లో ఓలాపై ట్రోలింగ్‌ జరుగుతోంది. దీంతో వీటికి బదులిచ్చే పనిలో పడ్డాడు భవీశ్‌ అగర్వాల్‌. 

చదవండి: ఈవీ టూ వీలర్‌ మార్కెట్‌లో నంబర్‌ వన్‌ ఓలా

మరిన్ని వార్తలు