ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్నవారికి గుడ్‌న్యూస్‌..!

5 Dec, 2021 08:26 IST|Sakshi

తన ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి ఎట్టకేలకు ఓలా ఎలక్ట్రిక్ శుభవార్త తెలిపింది. ఓలా ఎస్1, ఓలా ఎస్1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పెంచినట్లు తెలపడంతో పాటు డిసెంబర్ 15 నుంచి కస్టమర్లకు స్కూటర్లను డోర్ డెలివరీలు చేయనున్నట్లు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. చిప్స్ కొరత కారణంగా స్కూటర్ల డెలివరీ ఆలస్యం అయినట్లు గత నెలలో కంపెనీ తన వినియోగదారులకు తెలిపిన విషయం మనకు తెలిసిందే.

అగర్వాల్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు చెందిన కొన్ని చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. "ఉత్పత్తి పెరిగింది, డిసెంబర్ 15 నుంచి డెలివరీ చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. మీ ఓపికకి ధన్యవాదాలు!" అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఈ ఏడాది ఆగస్టు 15న తన స్కూటర్లను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ లాంచ్ సందర్భంగా ఓలా ఎస్1 ధర రూ.99,999 కాగా, ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,29,999గా పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై రాష్ట్రాలు అందించే సబ్సిడీలను బట్టి స్కూటర్ల ధర వివిధ రాష్ట్రాల్లో మారుతుంది.

ఇంతకు ముందు సెప్టెంబర్ నెలలో ఓలా ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సెకనుకు 4 స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. ఆ తర్వాత సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా కంపెనీ తన బుకింగ్స్‌ను, డెలివరీలను వాయిదా వేయాల్సి వచ్చింది. గత నెలలో కంపెనీ స్కూటర్ల కోసం తన కస్టమర్ టెస్ట్ రైడ్ కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 10న బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్ కతాలో టెస్ట్ రైడ్ కేంద్రాలను ప్రారంభించింది. ఆ తర్వాత నవంబర్ 19న చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, పూణే వంటి మరో ఐదు నగరాలలో టెస్ట్ రైడ్ కేంద్రాలను ఓపెన్ చేసింది.

(చదవండి: ఐఫోన్‌ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..!)

మరిన్ని వార్తలు