Road Accident: పరీక్ష రాసే ముందు బాబా దర్శనం కోసం వెళుతూ.. అంతలో టైరు పేలి..

5 Dec, 2021 07:45 IST|Sakshi
సంఘటనా స్థలం, రోదిస్తున్న సహచర మెడికోలు

సాక్షి, చెన్నై: పరీక్షలకు ముందు సాయిబాబాను దర్శించుకునేందుకు వెళ్లిన ఇద్దరు మెడికోలను ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. తెన్‌కాశి జిల్లా ఆవుడయనూర్‌కు చెందిన పొన్నుదురై, శారద దంపతుల కుమార్తె దివ్య గాయత్రి (21) నెల్లై ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. శనివారం తోటి విద్యార్థులు మదురై పరశురామన్‌ పట్టికి చెందిన ప్రీటా ఏంజలినా రాణి(23), దివ్యబాల(21)తో కలిసి శనివారం పరీక్ష రాసే ముందు రెడ్డియార్‌పట్టిలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునేందుకు బైక్‌లో బయలుదేరారు.

రెడ్డియార్‌ పట్టి సమీపంలో నాగర్‌కోయిల్‌ నుంచి తూత్తుకుడి వైపు వెళుతున్న కారు టైర్‌ పేలి అదుపుతప్పి డివైడర్‌ను దాటి మెడికోలను ఢీకొంది. దీంతో దివ్య గాయత్రి, ప్రీటా, కారులో ఉన్న నాగర్‌ కోయిల్‌ సుశీంద్రన్‌ వీధికి చెందిన షణ్ముగ సుందరం(41) అక్కడికక్కడే మృతిచెందారు. దివ్యబాల, షణ్ముగ సుందరం మిత్రుడు సంతోష్‌(45), కారు డ్రైవర్‌ సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాల్ని మెడికల్‌ కళాశాల ఆస్పత్రి మార్చురికి తరలించారు. అక్కడ మెడికోలు తమ సహచరుల మృతదేహాలను చూసి బోరున రోదించారు.

చదవండి: డ్రైవింగ్‌ చేసేందుకు డోర్‌ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి..

  

మరిన్ని వార్తలు