గడువులోపు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌క‌పోతే.. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలో తెలుసా?

2 Jan, 2022 17:52 IST|Sakshi

2020-21 ఆర్థిక సంవత్సరానికి(మార్చి 2021తో ముగిసింది) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌(ఐటీఆర్)లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసే గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. డిసెంబర్ 31, 2021 గడువు ముగిసే నాటికి దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌(ఐటీఆర్)లు దాఖలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే జనవరి 10, 2021 నాటికి దాఖలు చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్‌(ఐటీఆర్)లు 5.95 కోట్లు. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్‌ల దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువ.

గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా?
చాలా వరకు సామాన్య జనం గుడువు తేదీని చివరి తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే.. చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. కానీ గడువు తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోవడం వల్ల కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

ఎంత ఆలస్య రుసుము చెల్లించాలి?
గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆలస్య రుసుము కింద రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉన్న పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే(మార్చి 31, 2022 చివరి తేదీ లోపు) ఆలస్య రుసుము గరిష్టంగా రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము అనేది రూ.5 వేల వరకు ఉంటుంది.

(చదవండి: ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..)

మరిన్ని వార్తలు