ధరల మంట- పెట్రోల్‌ @ఆల్‌టైమ్‌ హై

7 Jan, 2021 09:19 IST|Sakshi

రెండో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

తాజాగా ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ రూ. 84.20కు

2018 అక్టోబర్‌లో రూ. 84కు పెట్రోల్‌ ధర- రికార్డ్‌

29 రోజుల తదుపరి బుధవారం పెరిగిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు సెగ

55 డాలర్ల సమీపానికి చేరిన బ్రెంట్ బ్యారల్‌ ధరలు

న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు నెల రోజుల తదుపరి బుధవారం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తాజాగా మరోసారి బలపడ్డాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇంధన రంగ పీఎస్‌యూలు ధరలను వరుసగా రెండో రోజు పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై తాజాగా 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు చొప్పున పెంచాయి. బుధవారం సైతం లీటర్‌ పెట్రోల్‌ ధరను 26 పైసలు, డీజిల్ ధరను 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 84.20ను తాకింది. డీజిల్‌ రూ. 74.38కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్‌ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్టం కాగా.. ప్రస్తుతం ఈ స్థాయిని ధరలు అధిగమించడం గమనార్హం. ఇక డీజిల్‌ ధరలైతే 2018 అక్టోబర్‌ 4న లీటర్‌కు రూ. 75.45 వరకూ ఎగసింది. కాగా.. 2020 మే నెల నుంచి చూస్తే.. పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ. 14.51 పుంజుకోగా.. డీజిల్ ధర రూ. 12.09 ఎగసింది. ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నట్లు పెట్రోలియం వర్గాలు ప్రస్తావించాయి. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!)

ముంబైలో మరింత
దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల సంగతి చూస్తే.. ముంబైలో తాజాగా లీటర్ పెట్రోల్‌ రూ. 90.83ను తాకగా.. డీజిల్‌ రూ. 81.07కు చేరింది. చెన్పైలో పెట్రోల్‌ రూ. 86.96కు, డీజిల్‌ రూ. 79.72కు చేరాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 85.68 వద్ద, డీజిల్‌ రూ. 77.97 వద్ద విక్రయమవుతోంది. (మళ్లీ మండుతున్న చమురు ధరలు)

విదేశీ ఎఫెక్ట్
విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు 6 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 0.85 శాతం పుంజుకుని 51 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్‌ చమురు సైతం బ్యారల్‌ 0.7 శాతం ఎగసి 54.67 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. 

ఏం జరిగిందంటే?
కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్‌ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్‌ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్‌ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్‌ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్‌ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్‌ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్‌ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు