పరిశ్రమ ధైర్యంగా రిస్క్‌ చేయాలి

12 Aug, 2021 03:52 IST|Sakshi

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు

ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటోందని భరోసా

సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగం

న్యూఢిల్లీ: ఇబ్బందులు వచ్చినా (రిస్క్‌) తట్టుకుని నిలబడదామన్న సాహసోపేత ధోరణిని భారత్‌ పరిశ్రమ పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కరోనా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్‌ ఎకానమీ తిరిగి వేగం పుంజుకుంటోందని కూడా ఆయన బుధవారం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ...

► దేశ ప్రయోజనాల పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఇటీవల  కీలక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవి సాహసోపేత నిర్ణయాలు. మహమ్మారి సమయంలోనూ సంస్కరణల బాటలో ప్రభుత్వం కొనసాగింది. ఏదో బలవంతంగా నిర్ణయాలను తీసుకోలేదు. ఆయా చర్యలు సత్ఫలితాలు అందిస్తాయనే ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.  
► భారత్‌ పరిశ్రమకు అవసరమైన మద్దతును అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి వెనుకాడబోదు.
► భారతదేశ స్వయం స్వావలంభన నినాదం విజయవంతం కావాలి. ఈ బాధ్యత ప్రధానంగా భారత పరిశ్రమపైనే ఉంది.  
► దేశ అభివృద్ధి, సామర్థ్యంపై పూర్తి విశ్వాసం వ్యక్తమవుతున్న ప్రస్తుత వాతావరణాన్ని పురోభివృద్ధికి ఒక అవకాశంగా మలుచుకోవాలని పారిశ్రామిక రంగాన్ని కోరుతున్నారు.  
► కొత్త ప్రపంచంతో కలిసి నడవడానికి భారత్‌ ఇప్పుడు పూర్తి సన్నద్దంగా ఉంది. ఆయా శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంది.  ఒకప్పుడు భారత్‌కు విదేశీ పెట్టుబడులు అనేవి కష్టం. ఇప్పుడు అన్ని రకాల పెట్టుబడులనూ స్వాగతించే స్థితిలో ఉన్నాం.  
► పన్నుల వ్యవస్థను సంస్కరించుకున్నాం. సరళతరం చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపూర్వక కార్పొరేట్‌ పన్ను విధానాన్ని రూపొందించుకుని, అనుసరిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న పరోక్ష పన్నుల సమగ్ర విధానం– వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)  అమలుల్లోకి తీసుకుని రావడమేకాదు, వసూళ్లలో సైతం రికార్డులను నమోదుచేసుకుంటున్నాం.  
► కార్మిక చట్టాలను హేతుబద్దీకరణకు కేంద్రం పెద్దపీట వేసింది. అలాగే మెజారిటీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని  సంస్కరణల ద్వారా మార్కెట్‌తో అనుసంధానిస్తున్నాం.  
► ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలు, సంబంధిత చర్యల ఫలితంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ), విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి.  
► స్టార్టప్స్‌ విషయంలో పెట్టుబడిదారుల స్పందన అనుహ్యంగా ఉంది. భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయనడానికి సంకేతమిది. భారత్‌కు ప్రస్తుతం 60 యూనికార్న్స్‌  (100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు)  ఉన్నాయి. వీటిలో 21 గత కొద్ది నెలల్లోనే ఈ స్థాయిని అందుకున్నాయి.  
► సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లు నుంచి బ్యాంకింగ్‌ డిపాజిటర్ల ప్రయోజనాలకు ఉద్దేశించిన డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణ వరకూ (డిపాజిట్లపై బీమా రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పెంపు) పలు బిల్లులను ప్రవేశపెట్టాం. సంస్కరణలపై ప్రభుత్వ సంకల్పాలనికి ఈ చర్యలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి.  
► గత ప్రభుత్వాలు చేసిన ఎన్నో తప్పిదాలను కేంద్రం సరిదిద్దుతోంది. రెట్రో ట్యాక్స్‌ రద్దు  చేస్తూ  కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇందులో ఒక భాగం.

మౌలికానికి ఫారెక్స్‌ నిల్వలు!:  గడ్కరీ సూచన
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రణలో భారీగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలను (జూలై 30తో ముగిసిన వారంలో రికార్డు స్థాయిలో 621 బిలియన్‌ డాలర్లు. రూపాయిల్లో దాదాపు 44 లక్షల కోట్లు)  దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు.  ఇందుకు సంబంధించి విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... భారత్‌కు మిగులు డాలర్‌ నిల్వలు ఉన్నాయి. 

వీటిని  దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోడానికి ఉద్దేశించిన విధాన రూపకల్పనపై ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చించాలని నేను నిర్ణయించుకున్నాను.  దేశంలో మౌలిక రంగంసహా పలు కీలక ప్రాజెక్టులకు ప్రస్తుతం చౌక వడ్డీరేటుకు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది.  విద్యుత్‌ శాఖకు అనుబంధంగా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌–పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది భారత్‌ విద్యుత్‌ రంగానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇదే విధంగా ఇండియన్‌ రైల్వేలకు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఉంది.  ఈ తరహాలోనే భారత్‌ జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి కూడా ఒక ఫైనాన్షియల్‌ అనుబంధ సంస్థ ఉండాలి.  రోడ్డు ప్రాజెక్టుల్లో భారీగా విదేశీ నిధులు వచ్చే లా కొత్త వ్యవస్థ రూపకల్పన తక్షణం జరగాలి.

మరిన్ని వార్తలు