పెట్రోల్‌పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..!

17 Jun, 2022 06:44 IST|Sakshi

పెట్రోల్‌ కొనుగోళ్లపై 0.75% రాయితీకి మంగళం

అమల్లోకి తీసుకొచ్చిన పీఎన్‌బీ

ఆయిల్‌ కంపెనీల నిర్ణయం ఫలితమే

న్యూఢిల్లీ: పెట్రోల్‌ కొనుగోళ్లకు డిజిటల్‌గా చేసే చెల్లింపులపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్‌బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్‌సైట్‌లో ఓ నోటిఫికేషన్‌ ఉంచింది. ‘‘ఇంధన కొనుగోళ్లపై అన్ని రకాల డిజిటల్‌ చెల్లింపులకు ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేయాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టు భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌) తెలిపింది’’ అంటూ పీఎన్‌బీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దీంతో మే నెల నుంచి డిజిటల్‌ చెల్లింపులపై ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు పీఎన్‌బీ తెలిపింది. 2016 నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నాటి నిర్ణయం వల్ల వ్యవస్థలో నగదుకు కొంత కాలం పాటు తీవ్ర కొరత ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు డిజిటల్‌ రూపంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు 0.75 శాతం రాయితీ ఇవ్వాలని ఆయిల్‌ కంపెనీలను కోరింది. దీంతో 2016 డిసెంబర్‌ 13 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్‌ కార్డు, యూపీఐ చెల్లింపులపై రాయితీ లభించింది. ఈ ప్రోత్సాహకాన్ని క్రెడిట్‌ కార్డులపై ముందే తొలగించారు. ఇప్పుడు మిగిలిన డిజిటల్‌ చెల్లింపులపైనా ఎత్తేసినట్టు అయింది.  

చదవండి: ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు..

మరిన్ని వార్తలు