ఈ ఏడాది 80 శాతం వృద్ధి: పోకో

13 Jun, 2023 07:42 IST|Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న పోకో ఇండియా ఈ ఏడాది 75–80 శాతం వృద్ధిని ఆశిస్తోంది. ప్రధానంగా మీడియం, ఎకానమీ విభాగంలో కంపెనీ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్‌ ఇందుకు కారణమని పోకో ఇండియా హెడ్‌ హిమాన్షు టాండన్‌ సోమవారం తెలిపారు. ‘మార్కెట్‌ పరిశోధన సంస్థ కెనాలిస్‌ ప్రకారం.. భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 10–15 శాతం క్షీణించింది. 

ఆన్‌లైన్‌ అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. అయితే షావొమీ సబ్‌–బ్రాండ్‌ పోకో మార్చి 2023 త్రైమాసికంలో 68 శాతం వృద్ధితో అమ్మకాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ బ్రాండ్‌గా ఉద్భవించింది. రూ.10,000 లోపు ధరల శ్రేణిలో సి–సిరీస్‌లో మూడు మోడళ్లను, రూ.20,000–25,0000 ధరల విభాగంలో ఎక్స్‌5 ప్రో మోడళ్లను విడుదల చేయడం 2023 తొలి త్రైమాసికంలో కంపెనీ వృద్ధికి ఆజ్యం పోశాయి. రెండవ త్రైమాసికం విక్రయాలు జనవరి–మార్చి కంటే ఎక్కువగా ఉన్నాయి. 

(ఇదీ చదవండి:  హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్‌ పాండ్యా)

కస్టమర్లలో 60 శాతం పాతవారే. కొన్ని పెద్ద బ్రాండ్‌లు ఆన్‌లైన్‌ విభాగంలో పలు ధరల శ్రేణులను ఖాళీ చేశాయని భావిస్తున్నాను. ఆ వాటాను పొందేందుకు ఇది మాకు సరైన సమయం. రూ.10,000లోపు సెగ్మెంట్‌పై దృష్టి పెడతాం. రూ.10 వేల శ్రేణిలో 5జీ మోడళ్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు.

మరిన్ని వార్తలు