లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు

22 May, 2023 04:41 IST|Sakshi

గతేడాది రూ. లక్ష కోట్లకు అప్‌

ఎస్‌బీఐ వాటా రూ. 50,000 కోట్లు  

న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్‌బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్‌అరౌండ్‌ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి.

2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్‌ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్‌ వన్‌ దిగ్గజం ఎస్‌బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్‌బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది.

మరిన్ని వార్తలు