Binod Chaudhary: నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు!

10 Oct, 2023 14:01 IST|Sakshi

ప్రపంచం కుబేరుడు ఎవరు అంటే 'ఎలాన్ మస్క్' అని, భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే వెంటనే 'ముఖేష్ అంబానీ' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన సమీప దేశమైన నేపాల్‌లో ధనికుడెవరు? అతని సంపద ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ప్రస్తుతం నేపాల్‌లో అధిక సంపన్నుడు 'బినోద్ చౌదరి' (Binod Chaudhary) అని తెలుస్తోంది. నేపాల్‌లోని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించిన బినోద్ మొత్తం ఆస్తి విలువ రూ. 14,977కోట్లు అని సమాచారం.

బినోద్ చౌదరి తాత నేపాల్‌కు వలస వెళ్లి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు, ఇదే వ్యాపారం అతని తండ్రికి వచ్చింది. ఆ తరువాత ఈ వస్త్ర వ్యాపారమే అనేక రంగాల్లో అడుగుపెట్టాలా చేసింది. జేఆర్‌డీ నుంచి ప్రేరణపొంది వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరించాడు. 

నిజానికి బినోద్ చౌదరి చదువుకునే రోజుల్లో చార్టర్డ్ అకౌంట్స్ చదవడానికి భారతదేశానికి వెళ్లాలనుకున్నాడు, కానీ తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత వ్యాపార రంగంలో తనదైన రీతిలో ముందుకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలో భాగంగా 1990లో సింగపూర్‌లో సినోవేషన్ గ్రూప్‌ ప్రారంభించారు. ఆ తరువాత వాయ్ వాయ్ నూడుల్స్ ప్రారంభించి మంచి ఆదరణ పొందాడు.

ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్‌ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!

బినోద్ చౌదరి బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది, దీంతో 1995లో నబిల్ బ్యాంక్‌లో దుబాయ్ ప్రభుత్వ నియంత్రణ వాటాను కొనుగోలు చేశారు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు అందిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే 2015లో భూకంపం వల్ల ధ్వంసమైన పాఠశాలలు, ఇళ్లను పునర్నిర్మించడంలో సహాయం చేయడానికి ఏకంగా రూ. 20 కోట్లకు పైగా విరాళం అందించమే కాకుండా 5,00,000 వాయ్ వాయ్ నూడుల్స్ (Wai Wai Noodles) ప్యాకెట్లు, ఆహారం, నీటిని సరఫరా చేసాడు.

మరిన్ని వార్తలు