మార్కెట్లు బేర్‌- ఈ షేర్ల దూకుడు తగ్గలేదు

24 Sep, 2020 14:01 IST|Sakshi

665 పాయింట్లు పతనం-37,003కు సెన్సెక్స్‌ 

183 పాయింట్లు డౌన్‌- 10949కు నిఫ్టీ

నాలుగో రోజూ రూట్‌ మొబైల్‌ హైజంప్‌

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ జోరు

వరుసగా ఆరో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 665 పాయింట్లు పడిపోయి 37,003కు చేరగా.. 183 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,949 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా నాలుగో రోజూ రూట్‌ మొబైల్‌ సరికొత్త గరిష్టాన్ని తాకగా.. రెండో రోజూ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ షేర్ల భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

రూట్‌ మొబైల్
పబ్లిక్‌ ఇష్యూ ధర రూ. 350తో పోలిస్తే లిస్టింగ్‌ రోజు సోమవారం 86 శాతం లాభంతో రూ. 650 వద్ద స్థిరపడిన రూట్‌ మొబైల్‌ తాజాగా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లి రూ. 972కు చేరింది. వెరసి నాలుగు రోజుల్లో 150 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుతం 16 శాతం జంప్‌చేసి రూ. 954 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్‌ రోజు గోల్డ్‌మన్‌ శాక్స్‌, కువైట్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రూ. 210 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్‌ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. షేరుకి రూ. 697 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ షేర్లు
కొద్ది నెలలుగా నలుగుతున్న వివాదాల నేపథ్యంలో టాటా సన్స్‌ నుంచి వైదొలగవలసిన అవసరమున్నట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. టాటా సన్స్‌లో షాపూర్‌జీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ. 1.5 లక్షల కోట్లవరకూ సమకూరగలవని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షాపూర్‌జీ గ్రూప్‌ వాటాను మార్కెట్‌ ధరకే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాటా సన్స్‌ ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ కౌంటర్లకు వరుసగా రెండో రోజు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 248 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 258 వరకూ ఎగసింది. ఇక బీఎస్‌ఈలో ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ షేరు రెండో రోజూ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 74 బలపడి రూ. 1,558 వద్ద ఫ్రీజయ్యింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు