ఆల్‌టైమ్ గరిష్టానికి.. జోరు మీదున్న ఎస్‌బీఐ షేరు!

16 Sep, 2022 07:03 IST|Sakshi

ముంబై: స్టాక్‌ సూచీలు రెండోరోజూ డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 413 పాయింట్లు నష్టపోయి 60 వేల దిగువున 59,866 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 18 వేల స్థాయిని కోల్పోయింది. చివరికి 126 పాయింట్లు పతనమై 17,877 వద్ద నిలిచింది. డెరివేటివ్స్‌ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్‌(3%), రిలయన్స్‌(ఒకశాతం) పతనమై సూచీలను ఏదశలోనూ కోలుకోనివ్వలేదు. అయితే ఆటో, మెటల్‌ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.  డాలర్‌ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి రూ.79.71 వద్ద స్థిరపడింది. ఆయిల్‌ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పడిందని నిపుణులు తెలిపారు.  

లాభాల్లోంచి నష్టాల్లోకి...  
సెన్సెక్స్‌ 108 పాయింట్ల లాభంతో 60,454 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 18,046 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 329 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్లను ఆర్జించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. 

మెప్పించని తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌
తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ షేరు లిస్టింగ్‌ తొలిరోజే నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.510తో పోలిస్తే ఫ్లాటుగా రూ.510 వద్దే లిస్టయ్యింది. రూ.484.5 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.  కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.5శాతం స్వల్ప నష్టంతో రూ.508 వద్ద ముగిసింది.

పీవీఆర్‌ షేర్ల అమ్మకం
మూడు ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈక్విటీ ఫండ్లు మల్టీప్లెక్స్‌ వ్యాపార సంస్థ పీవీఆర్‌కు చెందిన 40.45 లక్షల ఈక్విటీ షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా విక్రయించాయి. ఈ లావాదేవీ విలువ రూ.759.14 కోట్లుగా ఉంది. ఫలితంగా బీఎస్‌ఈలో పీవీఆర్‌ షేరు 4.40 శాతం నష్టపోయి రూ.1,844 వద్ద స్థిరపడింది. 

కొనసాగిన ఎస్‌బీఐ రికార్డు 
రెండోరోజూ ఎస్‌బీఐ షేరు జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్‌లోనూ ఒకశాతానికి పైగా లాభపడి రూ.579 వద్ద ఆల్‌టైం హై స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపు(రూ.572)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టానికి లోనవకుండా రూ.572 వద్ద స్థిరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత మార్కెట్‌ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరిన మూడో బ్యాంకు, తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. 

► ఆటో షేర్లలో భాగంగా మారుతీ సుజుకీ షేరు ట్రేడింగ్‌లో నాలుగు శాతం లాభపడి రూ.9,351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 3% పెరిగి రూ.9,245 వద్ద నిలిచింది. 

మరిన్ని వార్తలు