ఇష్యూ ధర సహేతుకంగా ఉండాలి.. లేదంటే ?

23 Dec, 2021 08:54 IST|Sakshi

మర్చంట్‌ బ్యాంకర్లు నిబంధనల స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి 

సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి  

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూలకు సహేతుకమైన ధరే కీలకమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తెలిపారు. ఈ విషయంలో మర్చంట్‌ బ్యాంకర్లు .. నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం మాత్రమే కాకుండా వాటి వెనుక గల స్ఫూర్తిని కూడా గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు. ఇటు ఇష్యూకి వచ్చే సంస్థల ఆకాంక్షలు, అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా విస్తృతంగా చర్చలు జరిపి తగు విధంగా ధరను నిర్ణయించాలని పేర్కొన్నారు. ఒకవేళ మధ్యవర్తి సంస్థలు తమ బాధ్యతలకు కట్టుబడకపోతే చర్యలు తీసుకునేందుకు సెబీ వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం టెక్నాలజీ కంపెనీల నియంత్రణ నిబంధనల్లోనూ తగు సమయంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని చెప్పారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐబీఐ) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా త్యాగి ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల లిస్టింగ్‌ తర్వాత పలు సంస్థల షేర్ల ధరలు .. ఇష్యూ ధరతో పోలిస్తే గణనీయంగా పతనమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ ఏడాది ఐపీవోల ద్వారా 76 కంపెనీలు ఏకంగా రూ. 90,000 కోట్లు (నవంబర్‌ వరకూ) సమీకరించాయి. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో పాలుపంచుకునే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరోవైపు, ఈ ఏడాది టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు .. పెద్ద ఎత్తున స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. జొమాటో ఐపీవోకి బంపర్‌ స్పందన లభించడంతో నైకా, పేటీఎం, పాలసీబజార్‌ వంటి టెక్‌ సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి.   

చదవండి:పేటీఎమ్‌ ఐపీవో తొలి రోజు.. ప్చ్‌!

మరిన్ని వార్తలు