డూప్లికేట్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం..సెబీ

26 May, 2022 06:47 IST|Sakshi

ఒరిజినల్‌ పోతే సులభంగా డూప్లికేట్‌ 

కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన సెబీ

న్యూఢిల్లీ: డూప్లికేట్‌ (నకలు) సెక్యూరిటీ సర్టిఫికెట్‌ల జారీకి అనుసరించే విధానం, డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను సెబీ సులభతరం చేసింది. సెక్యూరిటీ సర్టిఫికెట్ల నకలు కోరేవారు అందుకు సమర్పించాల్సిన పత్రాలతో జాబితాను సెబీ ప్రకటించింది. ప్రస్తుతం డూప్లికేట్‌ సెక్యూరిటీల సర్టిఫికెట్ల జారీకి రిజిస్ట్రార్‌ అండ్‌ షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు (ఆర్‌టీఏలు) అనుసరిస్తున్న విధానాన్ని సెబీ సమీక్షించింది. ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ కోరేవారు ఎఫ్‌ఐఆర్‌ కాపీ (ఈ–ఎఫ్‌ఐఆర్‌ కూడా) ఒరిజినల్‌ సెక్యూరిటీల ఫోలియో నంబర్, డిస్టింక్టివ్‌ నంబర్, సర్టిఫికెట్‌ నంబర్ల వివరాలను ఆర్‌టీఏలకు సమర్పించాలి. సెక్యూరిటీలు పోగొట్టుకున్నట్టు తెలియజేస్తూ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇవ్వాలి. అఫిడవిట్, ఇంటెమ్నిటీ బాండ్‌ను నిర్దేశిత విధానంలో సమర్పించాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎటువంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఒకవేళ దరఖాస్తు సమర్పించే నాటికి పోగొట్టుకున్న సెక్యూరిటీల విలువ రూ.5 లక్షకు మించకపోతే ఇవేవీ అవసరం లేదని సెబీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒకవేళ షేర్‌ సర్టిఫికెట్‌ నంబర్, ఫోలియో నంబర్, డిస్టింక్టివ్‌ నంబర్‌ ఇవేవీ లేకపోతే ఆర్‌టీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంతకం రికార్డులతో సరిపోలితే ఆర్‌టీఏ ఈ వివరాలను సెక్యూరిటీ హోల్డర్‌కు ఇవ్వాలని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిపోలేకపోతే అప్పుడు కేవైసీ వివరాలతో సెక్యూరిటీ హోల్డర్‌ తన గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత వివరాలు పొందాల్సి ఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు