ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి 

25 Nov, 2023 07:26 IST|Sakshi

ముంబై: ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో శుక్రవారం స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 48 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,970 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఎనిమిది పాయింట్లు తగ్గి  19,800 దిగువన 19,794 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం మిశ్రమంగా మొదలయ్యాయి.

జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఐటీతో పాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, కన్జూమర్, ఇంధన షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు మెటల్, ఫార్మా, ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు చెందిన చిన్న తరహా కంపెనీల షేర్లు రాణించాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో 4–3 నూతన ఉత్పత్తులను ఆవిష్కరణతో పాటు నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధిస్తామని చైర్మన్‌ సిద్ధార్థ మొహంతి ధీమా వ్యక్తం చేయడంతో ఎల్‌ఐసీ షేరు 9.50% లాభపడి రూ.678 వద్ద ముగిసింది. లిస్టింగ్‌ నుంచి ఈ షేరుకిదే అతి పెద్ద ర్యాలీ. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే  రూ.38 వేల కోట్లు పెరిగి రూ.4.28 లక్షల కోట్లకు చేరింది. 

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు పరిశీలించాలంటూ కోరుతూ ధాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్‌ చేయడం అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్లూ లాభాల్లో ముగిశాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ (2.3%, అదానీ పవర్‌ 4.06%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 1.2%, అదానీ ఎనర్జీ సెల్యూషన్స్‌ 0.84%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.77%, అంబుజా సిమెంట్‌ 0.31% చొప్పున లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు