6 నెలల గరిష్టం- 39,074కు సెన్సెక్స్

26 Aug, 2020 15:55 IST|Sakshi

230 పాయింట్లు ప్లస్‌-తొలుత ఆటుపోట్లు

77 పాయింట్లు పెరిగి 11,550 వద్ద ముగిసిన నిఫ్టీ

ఆటో, బ్యాంకింగ్‌, ఐటీ, మెటల్‌, రియల్టీ అప్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌

రెండు రోజులుగా కన్సాలిడేట్‌ అయినప్పటికీ వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్లు జంప్‌చేసి 39,074 వద్ద ముగిసింది. వెరసి ఆరు నెలల తదుపరి 39,000 పాయింట్ల మార్క్‌ ఎగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 11,550 వద్ద ముగిసింది. మంగళవారం వరుసగా మూడో రోజు యూఎస్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను చేరడం సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గురువారం ఆగస్ట్‌ సిరీస్‌ ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో మార్కెట్లు రెండు రోజులుగా ఒడిదొడుకులు చవిచూస్తున్నట్లు పేర్కొన్నారు.

మీడియా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, బ్యాంకింగ్‌ 1.5 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా 2.5 శాతం ఎగసింది. మెటల్‌, రియల్టీ, ఐటీ 0.8 శాతం చొప్పున బలపడగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.15 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, హీరో మోటో, ఇండస్‌ఇండ్‌, జీ, కొటక్‌ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్, యాక్సిస్‌, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఐషర్‌ 9-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఫైనాన్స్‌ గుడ్
డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, జీఎంఆర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అపోలో టైర్‌, మైండ్‌ట్రీ 6.4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో ఎంజీఎల్‌, హావెల్స్‌, టొరంట్‌ ఫార్మా, పెట్రోనెట్‌, జూబిలెంట్ ఫుడ్‌, దివీస్‌ ల్యాబ్‌ 2.2-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ .4-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,679 లాభపడగా.. 1,156 నష్టాలతో ముగిశాయి.   

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,481 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం  సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 219 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

>
మరిన్ని వార్తలు