భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో విదేశీ కంపెనీ..!

28 Mar, 2022 16:22 IST|Sakshi

సింగపూర్‌కు చెందిన దిగ్గజ సంస్థ సీ లిమిటెడ్‌(SEA) తమ ఈ-కామర్స్‌ వ్యాపారాన్ని  భారత్‌లో మూసివేస్తున్నట్లు సోమవారం రోజున ప్రకటించింది. షాపీ(Shopee) పేరుతో ఈ కామర్స్‌ వ్యాపారాన్ని భారత్‌లో నిర్వహిస్తోంది సీ లిమిటెడ్‌ సంస్థ. ఫ్రాన్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొన్ని వారాల్లోనే భారత్‌లో కూడా తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు షాపీ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.  

మార్కెట్‌ అనిశ్చితి..!
భారత్‌లో షాపీను మూసివేసేందుకు సీ లిమిటెడ్‌ (SEA) సంస్థ ముందుగానే ప్రణాళికలను రచించినట్లుగా తెలుస్తోంది. కొత్త విక్రేతలను రిక్రూట్‌ చేయడాన్ని షాపీ కొన్ని రోజుల ముందే నిలిపివేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో షాపీ మార్కెట్‌ క్యాప్‌ భారీగా పడి పోయింది. సుమారు 15 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది.  కాగా  సీ లిమిటెడ్‌కు చెందిన ఈ-కామర్స్ విభాగం షాపీను గ్లోబల్ మార్కెట్ అనిశ్చితుల దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 

గేమ్‌పై బ్యాన్‌ అందుకే నిర్ణయం..!
గత నెలలో జాతీయ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం సుమారు 53 పైగా యాప్స్‌ను బ్యాన్‌ చేసింది. వీటిలో సీ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన గరెనా ఫ్రీ ఫైర్‌ యాప్‌ కూడా ఉంది. ఈ యాప్‌ భారత్‌లో గణనీయమైన ఆదరణను పొందింది. అయితే ఫ్రీ ఫైర్‌ యాప్‌పై ప్రభుత్వం నిషేధం విధించడంతో సీ లిమిటెడ్‌ నేతృత్వంలోని షాపీ ఈ కామర్స్‌ సంస్థను మూసివేసినట్లుగా పలువురు భావించారు. ఐతే ఈ వ్యవహారంపై షాపీ ప్రతినిధులు వివరణను ఇచ్చారు.  ఇండియాలో తమ సేవల షట్‌డైన్‌ నిర్ణయానికి ఫ్రీ ఫైర్‌ బ్యాన్‌తో ఎలాంటి సంబంధం లేదని షాపీ ప్రతినిధులు ఒక ప్రకటనలో నొక్కి చెప్పారు. 

చదవండి: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది

మరిన్ని వార్తలు