ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

2 Mar, 2021 05:24 IST|Sakshi

గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గింపు

6.70 శాతం నుంచి ఆరంభం...

ముంబై: బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) వరకూ తగ్గింది. 6.70 శాతం నుంచీ గృహ రుణాలను ఆఫర్‌ చేయనున్నట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తాలు, సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా ఆఫర్‌ చేస్తున్న తాజా రుణ రేట్లు 2021 మార్చి 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ ప్రకటన ప్రకారం, రూ.75 లక్షల వరకూ రుణాలపై వడ్డీ 6.70 శాతం నుంచీ ప్రారంభమవుతుంది. రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ రుణ రేటు 6.75 శాతంగా ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజును కూడా బ్యాంక్‌ పూర్తిగా మినహాయిస్తుంది.

పండుగల సీజన్‌ నేపథ్యం..
పండుగల సీజన్‌ను ప్రత్యేకించి మార్చి 29వ తేదీ హోలీని పురస్కరించుకుని తాజా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రిటైల్‌ బిజినెస్‌) సలోనీ నారాయణ్‌ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా రుణ గ్రహీతలకు ఐదు బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యోనో యాప్‌ వినియోగించే కస్టమర్లకు కూడా ఐదు బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. రీపేమెంట్ల వ్యవస్థ సజావుగా ఉందని సలోనీ నారాయణ్‌ పేర్కొన్నారు. రుణాల రీపేమెంట్‌ సవాలుతో కూడిన అంశంగా తాము భావించడం లేదనీ ఆయన వెల్లడించారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కస్టమర్‌తో కలిసి ఆ సమస్య పరిష్కారంపై బ్యాంక్‌ దృష్టి పెడుతుందన్నారు. ఈ అంశానికి సంబంధించి బ్యాంక్‌ తగిన అన్ని చర్యలూ తీసుకుంటోందని వివరించారు. గృహ రుణ విభాగంలో ఎస్‌బీఐ మొండిబకాయిలు (ఎన్‌పీఏ) 0.67% నుంచి 0.68% వరకూ ఉన్నట్లు చైర్మన్‌ దినేష్‌ ఖారా గత నెల్లో పేర్కొన్నారు.  

రూ.5 లక్షల కోట్లకుపైగా వ్యాపారం...
ఎస్‌బీఐ  గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లపైగా ఉంది. బ్యాంక్‌ రియల్టీ అండ్‌ హౌసింగ్‌ బిజినెస్‌ (ఆర్‌ఈహెచ్‌బీయూ)  విభాగం   ఏయూఎం (అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) 2012లో రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించింది. 2023–24 చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్‌ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్‌లో బ్యాంకింగ్‌ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్‌బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు.  బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసానికి ఈ విభాగం నిదర్శనమని చైర్మన్‌ దినేష్‌ ఖారా పేర్కొన్నారు.  ఈ  సానుకూల పరిస్థితికి బ్యాంకు  సాంకేతికత, వ్యక్తిగత సేవలు కారణమన్నారు.  గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్‌ చొరవలను బ్యాంక్‌ ఆవిష్కరించింది. ఇందులో   రిటైల్‌ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్‌) ఒకటి. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్‌ సొల్యూషన్‌ ఇది.

మరిన్ని వార్తలు