క్యూ 3 ఫలితాల్లో టెక్‌ మహీంద్రా మెరుపులు

2 Feb, 2022 08:10 IST|Sakshi

క్యూ3లో రూ. 1,378 కోట్లు 

3,800 మందికి కొత్తగా ఉద్యోగాలు  

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 7 శాతం బలపడి రూ. 1,378 కోట్లను అధిగమించింది. సరఫరా సవాళ్ల కారణంగా లాభాలు పరిమితమైనట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 11,450 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 15.9 శాతం నుంచి 14.8 శాతానికి నీరసించాయి. క్యూ3లో ఆదాయాలు మెరుగుపడినప్పటికీ సరఫరా సమస్యలు లాభదాయకతకు అడ్డుపడినట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్‌ కులకర్ణి తెలియజేశారు. ప్రధానంగా కొత్త ఉద్యోగాలు, వేతన పెంపు, ప్రయాణ ఆంక్షల నడుమ సబ్‌కాంట్రాక్టులు వంటి అంశాలు దెబ్బతీసినట్లు పేర్కొన్నారు.  

10,000 మందికి చాన్స్‌ 
అంచనాలకు అనుగుణంగా క్యూ3లో 15 శాతం స్థాయిలో మార్జిన్లను సాధించినట్లు టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ప్రస్తావించారు. గతంతో పోలిస్తే ఈ కాలంలో మానవ వనరుల అంశంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదని తెలియజేశారు. తాజాగా చేర్చుకున్న 3,800 మంది ఉద్యోగులతో కలిపి సిబ్బంది సంఖ్య 1.45 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు చోటు కల్పించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో మరో 15,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. తాజా సమీక్షా కాలంలో ఉద్యోగ వలసల(ఎట్రిషన్‌) రేటు రెట్టింపై 24 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు.  

చదవండి:హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు

మరిన్ని వార్తలు