యూఎస్‌ మార్కెట్లకు టెక్‌ షాక్

4 Sep, 2020 09:06 IST|Sakshi

రికార్డ్‌ గరిష్టాల నుంచి కుప్పకూలిన ఇండెక్సులు

డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌- 3-5% మధ్య డౌన్‌

ర్యాలీకి కారణమైన ఫాంగ్‌ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు

యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ బోర్లా

వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్‌ ఎకానమీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో  డోజోన్స్‌ 808 పాయింట్లు(2.8%) పతనమై 28,293 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 126 పాయింట్లు(3.5%) పడిపోయి 3,455 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 598 పాయింట్లు(5%) దిగజారి 11,458 వద్ద స్థిరపడింది. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, బోయింగ్‌ తదితర దిగ్గజాల వెనకడుగుతో తొలుత డోజోన్స్‌ 1,000 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం!

పతన బాటలో
కొద్ది నెలలుగా దూకుడు చూపుతూ అటు ఎస్‌అండ్‌పీ, ఇటు నాస్‌డాక్‌ కొత్త రికార్డులను చేరుకునేందుకు దోహదపడుతున్న టెక్‌ దిగ్గజాల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జూన్‌ తదుపరి ఒక్క రోజులోనే ఫాంగ్‌ స్టాక్స్‌ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ 8 శాతం, విండోస్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 6.2 శాతం చొప్పున కుప్పకూలగా.. అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌ 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో జూమ్‌ 10 శాతం, టెస్లా 9 శాతం, ఎన్‌విడియా 9.3 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ఇక బ్లూచిప్స్‌ హెచ్‌పీ, బోయింగ్, డీరె 3 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే పటిష్ట త్రైమాసిక ఫలితాల కారణంగా కాల్విన్‌ క్లెయిన్ బ్రాండ్‌ కంపెనీ పీవీహెచ్‌ కార్ప్‌ 3.3 శాతం ఎగసింది. 

లాభాల స్వీకరణ
ఉన్నట్టుండి గురువారం వెల్లువెత్తిన అమ్మకాలకు ప్రధాన కారణం ట్రేడర్ల లాభాల స్వీకరణే అని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్‌-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూఏజ్‌ ఎకానమీ కౌంటర్లు నిరవధికంగా దూసుకెళుతున్నట్లు తెలియజేశారు. దీంతో సాంకేతికంగానూ మార్కెట్లు ఓవర్‌బాట్ స్థాయికి చేరుకున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు వివరించారు. ఉదాహరణకు గురువారంనాటి పతనం తదుపరి కూడా యాపిల్‌ ఇంక్‌ షేరు 2020లో ఇప్పటివరకూ 65 శాతం ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

బుధవారం రికార్డ్స్‌
పలు సానుకూల అంశాల నేపథ్యంలో బుధవారం ఎస్‌అండ్‌పీ  54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్‌డాక్‌ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఎస్‌అండ్‌పీ 22వసారి, నాస్‌డాక్‌ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డోజోన్స్‌ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది.

మరిన్ని వార్తలు