వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు కొత్త తరహా టర్మ్‌ ప్లాన్స్‌..

2 Oct, 2023 07:54 IST|Sakshi

జీవిత బీమాకు సంబంధించి అత్యంత సరళమైన పాలసీ టర్మ్‌ ఇన్సూరెన్స్‌. ఇది పాలసీదారు కన్నుమూసిన పక్షంలో, వారు తమ జీవితకాలంలో చెల్లించిన ప్రీమియంలకు ప్రతిగా వారి కుటుంబసభ్యులకు (లబ్ధిదారులకు) నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తామంటూ బీమా కంపెనీ ఇచ్చే హామీ. కొత్త ఇన్వెస్టర్లు సాధారణంగానే సరళమైన, సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లను అన్వేషిస్తుంటారు కాబట్టి వారి కేటగిరీలో టర్మ్‌ ప్లాన్లకు ఆదరణ ఉంటోంది. ఈ పాలసీల కాలవ్యవధి 15 నుంచి 40 ఏళ్లు, అంతకు పైబడి ఉంటుంది. తమకు అనుకూలమైన కాలవ్యవధిని పాలసీదారు ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభమయ్యే సమయానికి పాలసీదారు వయస్సు, ఎంచుకున్న మొత్తం సమ్‌ అష్యూర్డ్‌ బట్టి ప్రీమియం ఉంటుంది.

వార్షిక ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునేందుకు చాలా మటుకు బీమా కంపెనీల వెబ్‌సైట్లలో ఉండే ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కాల్‌క్యులేటర్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ ఒకవేళ పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి మొత్తం సమ్‌ అష్యూర్డ్‌ లభిస్తుంది. ఇన్సూరెన్స్‌ కాల వ్యవధి తీరేంత వరకు పాలసీదారు జీవించే ఉన్న పక్షంలో వారు మొత్తం సమ్‌ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ల రూపంలో వడ్డీని కూడా పొందే విధమైన పాలసీలూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు దీనికి అదనంగా ప్రత్యేక అలవెన్సులు, బహుమతులు, లాయల్టీ అడిషన్‌ వంటివి కూడా ఇస్తున్నాయి.

టర్మ్‌ ప్లాన్లకు ఎందుకింత ఆదరణ..
వివిధ ప్రొఫెషన్స్‌కు చెందిన కస్టమర్లు తమకు అవసరమైనవి ఎంపిక చేసుకునేలా వివిధ ఫీచర్లు, సరళమైన ఆప్షన్స్‌తో టర్మ్‌ ప్లాన్లు లభిస్తాయి. కొన్ని ప్లాన్లు డెత్‌ క్లాజ్‌తో వచ్చినప్పటికీ యాక్సిడెంటల్‌ డెత్, శాశ్వత వైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి ఆప్షన్స్‌తో పాటు నిర్దిష్ట వయస్సుకు వచ్చాకా పెన్షన్‌ పొందేటువంటి అదనపు క్లాజ్‌లతో కూడా లభిస్తుంటాయి. ఇక కొన్ని టర్మ్‌ ప్లాన్లలో మనీ బ్యాక్‌ ఫీచర్‌ ఉంటుంది. ఈ తరహా పాలసీలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి సమ్‌ అష్యూర్డ్‌లో నిర్దిష్ట శాతం మొత్తాన్ని పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ చెల్లింపులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 10 కింద ఇన్‌కం ట్యాక్స్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిల్లల చదువు లేదా వివాహం లేదా వ్యాపారంపై పెట్టుబడి పెట్టుకోవడం వంటి ఖర్చుల కోసం పాలసీదారుకి ఈ మొత్తం ఉపయోగపడగలదు.

కొన్ని టర్మ్‌ ప్లాన్లలో చెల్లించాల్సిన ప్రీమియాన్ని తగ్గించుకునే ఆప్షన్‌ కూడా ఉంటుంది. కొందరు ప్రొఫెషనల్స్‌కు సంపద ఉండొచ్చు. దానితో పాటు కట్టాల్సిన బకాయిలు, అప్పులూ ఉండొచ్చు. అలాంటి వారు తమకు ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ప్రీమియాన్ని చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా వారు పెట్టుబడి పెట్టడం కోసం పెద్ద మొత్తంలో నగదును కేటాయించాల్సిన అవసరం లేకుండా, అలాగే అదే సమయంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ద్వారా తమ ఆర్థిక భవిష్యత్తును భద్రపర్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదు. 

ఎండోమెంట్‌ పాలసీగా లేదా నెలవారీ యాన్యుయిటీలతో కూడుకున్న పెన్షన్‌ ఫండ్‌లాగా మార్చుకునే సౌలభ్యంతో కూడా పలు టర్మ్‌ పాలసీలు లభిస్తున్నాయి. ఆ విధంగానూ ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీ, ప్రీమియాన్ని సవరించే అవకాశం ఉన్నప్పటికీ, మారే తమ అవసరాలకు అనుగుణమైన బీమా పాలసీ ప్రయోజనాలను పాలసీదారు పొందవచ్చు. కొందరు ప్రొఫెషనల్స్‌ తమ టర్మ్‌ ప్లాన్లను హోల్‌ లైఫ్‌ పాలసీలుగా మార్చుకోవాలనుకోవచ్చు. అలాంటప్పుడు సర్వైవల్‌ ప్రయోజనాలు లభించవు. దానికి బదులుగా పాలసీదారు మరణానంతరం, పాలసీ మెచ్యూరిటీ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బీమా కంపెనీ చెల్లిస్తుంది.

కొత్త తరహా ప్లాన్స్‌ .. 
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు టర్మ్‌ పాలసీల్లో పలు కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. డెత్‌ క్లాజ్‌తో పాటు కొన్ని టర్మ్‌ ప్లాన్లు 64 పైచిలుకు కీలక అనారోగ్యాలు, వ్యాధులకు కవరేజీ అందిస్తున్నాయి. ఇక టర్మ్‌ ప్లాన్‌ 40 ఏళ్ల పైబడిన కాలానికి ఉన్నా, పాలసీదారులు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని విధమైన పాలసీలూ ఉన్నాయి. సదరు వయస్సుకు వచ్చాకా రిటైర్‌ అయ్యే ప్రొఫెషనల్స్‌ ఈ తరహా టర్మ్‌ పాలసీలతో ప్రయోజనం పొందవచ్చు. ఇక కొన్ని కొత్త రకం ప్లాన్లను చూస్తే.. వరుసగా పదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత కొన్ని ప్రీమియంలను దాటవేసేందుకు వీలు కల్పించేవీ ఉంటున్నాయి. తద్వారా పాలసీదారులకు ఒక ఏడాది, రెండేళ్ల పాటు కాస్త వెసులుబాటు లభించగలదు.

ఏదైతేనేం.. తమ భవిష్యత్తు అలాగే తాము ప్రేమించే వారి భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు టర్మ్‌ పాలసీలపై ఇన్వెస్ట్‌ చేయడం వివేకవంతమైన నిర్ణయం కాగలదు. ఆలస్యం చేసే కొద్దీ వయస్సును బట్టి ప్రీమియం భారం కూడా పెరిగిపోతుంది కాబట్టి.. దీన్ని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది.

మరిన్ని వార్తలు