టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!

20 Jan, 2022 12:24 IST|Sakshi

ముంబై: గత కొద్ది రోజుల నుంచి టెస్లా కంపెనీని తమ రాష్ట్రంలో అంటే.. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయలని అనేక రాష్ట్రాల మంత్రులు పోటీ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, మహారాష్ట్రకు చెందిన ఈ మంత్రి మాత్రం.. టెస్లా కంపెనీకి అనుకూలంగా ఒక లేఖను కేంద్రం మంత్రికి రాశారు. మహారాష్ట్ర పర్యాటక & పర్యావరణ మంత్రి ఆదిత్య థాక్రే వచ్చే నెల ప్రారంభంలో సమర్పించనున్న రాబోయే కేంద్ర బడ్జెట్ 2022-23లో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

థాక్రే రాసిన లేఖలో ఇలా ఉంది.. "టెస్లా, రివియన్, ఆడీ, బిఎమ్‌డబ్ల్యు వంటి దిగ్గజ సంస్థలకు రిటైల్ అమ్మకం కోసం దిగుమతి కస్టమ్స్ సుంకల మీద కాలపరిమితితో కూడిన రాయితీ రేటు ఇవ్వాలి. ఇది మార్కెట్లో డిమాండ్ పెంచడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సహకరిస్తుంది. అమ్మకాలు పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే, ఇలాంటి దిగ్గజ కంపెనీల నాయకత్వాన్ని అనుసరించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది" అని పేర్కొన్నారు. రాయితీ రేటు గరిష్టంగా మూడు సంవత్సరాలు ఇవ్వాలని, భారతదేశంలో ప్రపంచ ప్రమాణాలను పాటించే ఎలక్ట్రిక్ వాహనలను మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. 

40 శాతం డిస్కౌంట్ కావాలి
భారతదేశంలో ఇతర దేశాలలో తయారు చేసిన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా చూస్తుంది. కానీ, మన దేశంలో దిగుమతి పన్నులు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని గతంలో మస్క్ చెప్పారు. టెస్లా బేసిక్ మోడల్ 3 కారు ధర $39,990(సుమారు రూ.30 లక్షలు). విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది.

ఈ సుంకల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్‌ వెల్‌ఫేర్‌ సర్‌చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు