ఫండ్స్‌కు కూడా త్వరలోనే టీప్లస్‌1

25 Jul, 2023 04:43 IST|Sakshi

దీనివల్ల ఎంతో ఆదా

నిబంధన అమలు సులభతరం

మరింత సులభంగా డీలిస్టింగ్‌

సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణ సమయాన్ని ఒక్కరోజుకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పూరి బుచ్‌ తెలిపారు. స్టాక్‌ మార్కెట్లో ఇప్పటికే నగదు విభాగంలో అన్ని రకాల స్క్రిప్‌లకు టీప్లస్‌1 వధానం అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లపై దీని ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణకు టీప్లస్‌2 విధానం అమలవుతోంది. ట్రేడ్‌ చేసిన తర్వాత నుంచి రెండో రోజు ముగింపునే యూనిట్ల కేటాయింపు, లేదా నగదు జమ ప్రస్తుతం సాధ్యపడుతోంది.

టీప్లస్‌ 1 అమల్లోకి వస్తే ట్రేడ్‌ చేసిన మరుసటి రోజే లావాదేవీ సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి ముందు వరకు టీప్లస్‌3 అమల్లో ఉండేది. ఈక్విటీలకు టీప్లస్‌1 అమల్లోకి వచి్చన వెంటనే, ఫండ్స్‌ టీప్లస్‌2కు మారాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల ఉపసంహరణ కాలాన్ని తగ్గించడం వల్ల తమ అంచనా ప్రకారం ఇన్వెస్టర్లకు రూ.230 కోట్ల మేర ప్రయోజనం సమకూరిందని మాధురి తెలిపారు ప్రస్తుతానికి సెబీ ముందు ఆరు మ్యూచువల్‌ ఫండ్‌ దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్టు వెల్లడించారు.  

నిబంధనలు వేగంగా అమలు..
పరిశ్రమ నిబంధనలను వేగంగా అమలు చేయడానికి పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్డడాన్ని పరిశీలిస్తున్నట్టు సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ తెలిపారు. సెబీ ప్రకటించిన నిబంధన అమలు చాలా కష్టంగా ఉంటుందనే అభిప్రాయం భాగస్వాముల నుంచి వ్యక్తమవుతుండడంతో నూతన ఆర్కిటెక్చర్‌ఫై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇదొక రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌గా పేర్కొన్నారు. నిబంధనల అమలులో పరిశ్రమకు సహకారం అందించే మాదిరిగా ఉంటుందన్నారు. నిబంధనలను పాటించేందుకు కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు చేయాలని సెబీ కోరుకోవడం లేదన్నారు.   

డీలిస్టింగ్‌ సులభతరం..
డీలిస్టింగ్‌ విధానాన్ని సమీక్షిస్తామని సెబీ చైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని డిసెంబర్‌ నాటికి విడుదల చేస్తామని ప్రకటించారు.డీలిస్టింగ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రివర్స్‌ బుక్‌ బిల్డింగ్‌ విధానంపై ఆందోళనలు ఉన్నట్టు చెప్పారు. కంపెనీలో 10 శాతానికి పైగా వాటా కొనుగోలు చేయడం ద్వారా ఆపరేటర్లు రేట్లను పెంచి, కంపెనీలకు భారంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్మన్‌ కేకి మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డీలిస్టింగ్‌కు ఫిక్స్‌డ్‌ ధర విధానాన్ని తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు.

రివర్స్‌బుక్‌ బిల్డింగ్‌ విధానంలో వాటాదారులు తమకు నచి్చన ధరను కోట్‌ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఫిన్‌ఫ్లూయెన్సర్స్‌ (ఆర్థికంగా ప్రభావితం చేసే వ్యక్తులు) పై సంప్రదింపుల పత్రాన్ని తీసుకువస్తామని సెబీ చైర్‌పర్సన్‌ తెలిపారు. ఫిన్‌ఫ్లూయెన్సర్‌ను సెబీ నియంత్రించలేదని స్పష్టం చేశారు. వారు తమ వ్యక్తిగత హోదాలో చేసే సిఫారసులను భారతీయ చట్టాల కింద నిషేధించలేమని స్పష్టం చేశారు. కాకపోతే వీరితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా స్టాక్‌ బ్రోకర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ను నియంత్రించగలమన్నారు.

తక్షణమే సెటిల్‌మెంట్‌
స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో లావాదేవీ నమోదైన వెంటనే పరిష్కరించే సెటిల్‌మెంట్‌ విధానాన్ని (ఇన్‌స్టానియస్‌) తీసుకురావడమే తమ లక్ష్యమని సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ తెలిపారు. ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టామని చెబుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. నిజానికి సెబీ ఇటీవలే స్టాక్స్‌కు టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ను తీసుకొచి్చంది. నూతన విధానంలో దీన్ని మరింత తగ్గించనున్నట్టు తెలుస్తోంది. నూతన సెటిల్‌మెంట్‌ను అమలు చేసే విషయమై భాగస్వాములతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని సెబీ చైర్‌పర్సన్‌ తెలిపారు. క్యాపిటల్‌ మార్కెట్లలో సమయం ఎంతో ముఖ్యమని చెబుతూ.. ఆలస్యం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు