2030 కల్లా ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 60 శాతం వాటా ఆసియా దేశాలవే: అంబానీ

24 Feb, 2022 01:39 IST|Sakshi

రెండు దశాబ్దాల్లో సాకారం

అర లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులు సాధిస్తాం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

న్యూఢిల్లీ: రాబోయే రెండు దశాబ్దాల్లో పర్యావరణ అనుకూల ఇంధన రంగంలో భారత్‌ దిగ్గజంగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. 0.5 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే హరిత ఇంధనాన్ని ఎగుమతి చేయగలదని ఆయన తెలిపారు. టెక్నాలజీతో కొత్త, పరిశుభ్రమైన ఇంధనాల వ్యయాలు గణనీయంగా తగ్గగలవని ఆసియా ఎకనమిక్‌ డైలాగ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ చెప్పారు. అయితే, ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోదని.. బొగ్గు, దిగుమతి చేసుకున్న చమురుపై భారత్‌ ఆధారపడటం మరో రెండు, మూడు దశాబ్దాల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ, రాబోయే రోజుల్లో కర్బన ఉద్గారాలను పూర్తిగా నివారించే వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

21వ శతాబ్దంలో భౌగోళికరాజకీయ పరిస్థితులను హరిత ఇంధన విధానాలవైపు మళ్లడమే ప్రభావితం చేయగలదని అభిప్రాయపడ్డారు. ఇంధనంగా బొగ్గు స్థానంలో కలప చేరినప్పుడు భారత్, చైనాను యూరప్‌ దేశాలు అధిగమించాయని ఆయన చెప్పారు. అలాగే చమురు వాడకం మొదలైనప్పుడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే అమెరికా, పశ్చిమాసియా పురోగతి చెందాయని పేర్కొన్నారు. ‘హరిత, పరిశుభ్ర ఇంధనాల విషయంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా మారాకా భారత్‌ .. ప్రపంచంలోనే ప్రబల శక్తిగా ఆవిర్భవిస్తుంది‘ అని అంబానీ తెలిపారు. ఈ పరిణామక్రమంతో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, గణనీయంగా విదేశీ మారకం కూడా ఆదా అవుతుందని చెప్పారు.  

కొత్త సూపర్‌ పవర్‌గా ఇండియా..
గడిచిన రెండు దశాబ్దాలు చూస్తే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదిగిందని, వచ్చే 20 ఏళ్లలో ఇంధనం.. జీవ శాస్త్రంలో సూపర్‌ పవర్‌గా ఆవిర్భవిస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. హరిత ఇంధనాల విషయంలో యావత్‌ ప్రపంచం ఇంకా కుస్తీ పడుతుంటే.. భారత్‌ ఏకంగా ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని పని చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇందుకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు.

‘రాబోయే 10–20 ఏళ్లలో ఎనర్జీ, టెక్నాలజీ విభాగాల్లో దేశీయంగా కనీసం 20–30 కొత్త కంపెనీలు.. రిలయన్స్‌ స్థాయిలో లేదా అంతకు మించి వృద్ధి చెందగలవని భావిస్తున్నాను‘ అని అంబానీ చెప్పారు. రిలయన్స్‌కు 1 బిలియన్‌ డాలర్‌ కంపెనీగా మారడానికి 15 ఏళ్లు, 10 బిలియన్‌ డాలర్ల మార్కును చేరేందుకు 30 ఏళ్లు, 200 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరేందుకు 38 ఏళ్లు పట్టిందని ఆయన తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం 10 బిలియన్‌ డాలర్ల కన్నా తక్కువగా ఉన్న భారత టెక్నాలజీ, డిజిటల్‌ ఎగుమతులు నేడు 150 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇవి అర లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరగలవు. అలాగే, 20 ఏళ్లలో హరిత ఇంధన ఎగుమతులు కూడా అర లక్ష కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు.
 

 

టెక్నాలజీతో చౌకగా ఇంధనం  
వాణిజ్యపరంగా లాభదాయకత సాధించగలిగితే టెక్నాలజీ పురోగతితో.. హరిత ఇంధనం చౌకగా లభించడానికి ఆస్కారం ఉంటుందని అంబానీ చెప్పారు. దానికి తోడు ప్రభుత్వం కూడా పారదర్శకమైన, వినియోగదారులకు అనుకూలమైన విధానాల ద్వారా కొత్త ఇంధనాలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పునరుత్పాదకత వనరుల ద్వారా 2030 నాటికి నిర్దేశించుకున్న విద్యుదుత్పత్తి లక్ష్యాల్లో 40 శాతాన్ని 2021 నాటికే భారత్‌ సాధించేసిందని అంబానీ తెలిపారు. హరిత హైడ్రోజన్‌ ధరను కిలోకు డాలర్‌ కన్నా తక్కువకే అందించవచ్చని, రవాణా తదితర వ్యయాలను కూడా డాలర్‌ లోపే కట్టడి చేయవచ్చని ఆయన చెప్పారు. ‘భారతదేశ పురోగతిని ఎవ్వరూ ఆపలేరు. మనది 5 లక్షల కోట్ల డాలర్లు.. ఆ పైన 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా కచ్చితంగా అయి తీరుతుంది. అది 2025లో లేదా 2027 అవుతుందా లేక 2030–2032లో అవుతుందా అన్నదే ఆలోచించా ల్సిన విషయం‘ అని అంబానీ వ్యాఖ్యానించారు.

(చదవండి: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన న్యూ ఏజ్ బాలెనో కారు..!)

మరిన్ని వార్తలు