భారీగా పెరగనున్న వాహన ధరలు.. వచ్చే నెల నుంచి అమలు.. కార్లు, బైక్‌లు ప్రియం!

24 Mar, 2023 07:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల ధరలు ప్రియం కానున్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్‌ స్టేజ్‌ - 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుండడమే ఇందుకు కారణం. ప్యాసింజర్, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ధరలు వర్తించనున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్‌ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి.  

ఖరీదు రూ.30,000 వరకు..
ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు తమ వాహనాలను అప్‌గ్రేడ్‌ చేశాయి. దీంతో ప్యాసింజర్‌ కార్లు మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.10,000 మొదలుకుని రూ.30,000 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలు రూ.2,500 దాకా భారం కానున్నాయి. ఇప్పటికే ముడిసరుకు వ్యయాలకు అనుగుణంగా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. అన్ని రకాల వాహన విభాగాల్లోనూ తయారీ కంపెనీలు ధరలను సవరించాయి. 

వాహనాల్లో మార్పులు..
నూతన ఉద్గార ప్రమాణాల కింద వాహనాలకు ఆధునిక సాంకేతికత వినియోగించాల్సి వస్తోంది. ప్రోగ్రామ్‌తో కూడిన ఫ్యూయల్‌ ఇంజెక్టర్స్, సెల్ఫ్‌ డయాగ్నోస్టిక్‌ డివైసెస్‌ ఏర్పాటు తప్పనిసరి అయింది. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని తెలిపే పరికరం అమర్చాల్సి ఉంటుంది. యూరప్‌లో అమలులో ఉన్న యూరో- 6 ప్రమాణాలకు సమానంగా భారత్‌ స్టేజ్‌- 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలను తీర్చిదిద్దారు. దీంతో వాహనాల్లోని ఇంజిన్లను అప్‌గ్రేడ్‌ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పరిశ్రమలో 7,00,000 ప్యాసింజర్‌ కార్లకు బుకింగ్స్‌ నమోదై ఉన్నాయి. ధర పెరగడం వల్ల డిమాండ్‌ తగ్గే అవకాశం లేదని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. 

వ్యయ భారంతో..
ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్లలో మార్పుల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. అధికంగా డిమాండ్‌ ఉన్న మోడళ్లను మాత్రమే కంపెనీలు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. డిమాండ్‌ తక్కువ ఉన్న మోడళ్లకు స్వస్తి పలకడం తప్పడం లేదు. ఏప్రిల్‌ 1 నుంచి ఇటువంటివి కనుమరుగు కానున్నాయి. వీటిలో మారుతీ సుజుకీ ఆల్టో 800, హోండా జాజ్, డబ్ల్యూఆర్‌–వి, అమేజ్‌ డీజిల్, సిటీ జనరేషన్‌-4, సిటీ జనరేషన్‌-5 డీజిల్, మహీంద్రా ఆల్టరస్‌ జీ4, కేయూవీ100, మరజ్జో, స్కోడా అక్టావియా, సూపర్బ్, హ్యుండై ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్‌ 800, నిస్సాన్‌ కిక్స్, టాటా ఆ్రల్టోజ్‌ డీజిల్, టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్‌ మోడళ్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు