అసలే వర్షాకాలం, కారు ఇంజిన్‌ పాడైతే బీమా వర్తిస్తుందా? ఏం చేయాలి?

18 Jun, 2021 18:02 IST|Sakshi

వర్షాకాలం వచ్చింది అంటే చాలు వాహదారులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. చిన్న పాటి వర్షానికి మన మెట్రో నగరాలు సముద్రాలను తలపిస్తాయి. వర్షం కాలంలో వాహనాలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. అందుకే వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఇంజిన్ సమస్యలతో బీమా కంపెనీలకు భారీగా క్లెయిమ్స్ వస్తాయి. వర్షాకాలంలో వచ్చే చాలా క్లెయిమ్స్ ప్రకృతి కారణంగా నష్ట పోయినవే. నీరు లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా కారు ఇంజిన్ డ్యామేజీ అవుతాయి. కారు యజమానుల నిర్లక్ష్యం చేత బీమా కంపెనీలు ఎక్కువగా ఈ క్లెయిమ్​లను తిరస్కరిస్తున్నాయి. 

నీటి వల్ల ఇంజిన్ దెబ్బతినడం సాధారణంగా రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి కారు నీటిలో మునిగిపోయినప్పుడు, రెండవది కారు యజమాని వరద నీటిలో నుంచి ప్రయాణించినప్పుడు. మొదటి సందర్భంలో కారు మునిగిపోయి తేలిన తర్వాత వాహన యజమాని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు ఇటువంటి సందర్భంలో బీమా కంపెనీకి కాల్ చేయడం మంచిది. కాల్ చేశాక మీ పరిస్థితి వివరించి ఏమి చేయాలో అడగండి. తనిఖీ కొరకు వారు వాహనాన్ని దగ్గరల్లో ఉన్న అధీకృత గ్యారేజీకి తీసుకెళ్లాలని బీమా కంపెనీ సూచించవచ్చు. ఒకవేళ ఇంజిన్ పూర్తిగా పాడైపోయినట్లయితే అది ప్రమాదంగా పరిగణిస్తారు, అది నిర్లక్ష్యం కాదు.

ఇక రెండవ సందర్భంలో నీటితో నిండిన ప్రాంతం గుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ డ్యామేజీని వివాద అంశంగా పరిగణిస్తారు. అయితే, డ్రైవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి వారికి ఎలాంటి మార్గం లేనందున బీమా కంపెనీ ఇటువంటి క్లెయిమ్స్ తిరస్కరిస్తాయి. ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే, వరద ప్రాంతంలో కారు మునిగిపోతే దానిని స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది. నీటి మట్టం తగ్గిన తర్వాత, బీమా కంపెనీకి కాల్ చేసి, ఏమి చేయాలో అడగండి. ఇటువంటి సమయంలో క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం తక్కువ.

లోతట్టు ప్రాంతాలలో, ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న వారు ఇటువంటి వివాదాలను పరిష్కరించడం కొరకు, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ ని తీసుకుంటే మంచిది. యాడ్ ఆన్ ఇంజిన్ కు అన్ని రకాల డ్యామేజీలను కవర్ చేస్తుంది. ఒకవేళ నీరు క్యాబిన్ లోనికి ప్రవేశించి, స్పీకర్ లు, సెన్సార్ లు, ఎలక్ట్రిక్ ఎక్విప్ మెంట్ వంటి భాగాలు డ్యామేజీ అయితే, బీమా కంపెనీ వీటికి నగదు చెల్లించదు. ఫ్యాక్టరీలో ఫిట్ చేయబడ్డ భాగాలకు మాత్రమే చెల్లిస్తుందని గమనించాలి. 

చదవండి: రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు

మరిన్ని వార్తలు