యాపిల్‌కు ఎదురు దెబ్బ, ఎలక్ట్రిక్‌ కార్ల రహస్యాల్ని దొంగిలించిన ఉద్యోగి!

24 Aug, 2022 21:04 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న యాపిల్‌ సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడన్న చందంగా..సంస్థలో ఎలక్ట్రిక్‌ కార్లకు సంబంధించిన రహస్యల్ని దొంగిలించిన ఉద్యోగుల్ని యాపిల్‌ గుర్తించలేకపోయింది. వెరసీ వచ్చే ఏడాది యాపిల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను విడుదల చేయాలన్న ప్రయత్నాలకు గండిపడినట్లు తెలుస్తోంది. 

యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు సంబంధించిన డాక్యుమెంట్లను దొంగిలించిన కేసులో ఆ సంస్థ మాజీ ఉద్యోగి నేరాన్ని అంగీకరించాడు. పలు నివేదికల ప్రకారం..చైనాకు చెందిన జియోలాంగ్ జాంగ్ (Xiaolang Zhang), 2015 నుండి 2018 వరకు యాపిల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు ప్రాజెక్ట్‌లో పనిచేశాడు. ఆ తర్వాత యాపిల్‌ నుంచి బయటకొచ్చిన ఉద్యోగి జాంగ్‌.. ఎక్స్‌ పెంగ్‌  (XPeng) అనే చైనా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌లో చేరాడు. 

భార్య ల్యాప్‌ట్యాప్‌కు 
అయితే యాపిల్‌ ఉద్యోగిగా పనిచేసే సమయంలో జాంగ్‌ ఎయిర్‌డ్రాప్ ద్వారా అతని భార్య ల్యాప్‌టాప్‌కు యాపిల్‌ ఈవీ కారుకు సంబంధించిన 24జీబీ రహస్యాల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు యాపిల్‌ గుర్తించింది. కంపెనీకి చెందిన అటానమస్‌ వెహికల్‌ ల్యాబ్‌ నుంచి సర్క్యూట్‌ బోర్డులు, సర్వర్‌ని దొంగిలించాడు. 2018లో కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌ నుంచి చైనాకు వెళ్లేందుకు సిద్ధమైన అతడిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్‌ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అతను పితృత్వ (paternity) సెలవుపై చైనాకు వెళ్లిన తర్వాత  కారు సంబంధించిన డేటా లీకేజీ అవ్వడం, అందులో జాంగ్‌ ప్రమేయం ఉందని యాపిల్‌ అనుమానం వ్యక్తం చేసింది. దర్యాప్తు చేయాలని ఎఫ్‌బీఐ అధికారుల్ని కోరింది. 

అనుమానం బలపడింది
అందుకు ఊతం ఇచ్చేలా చైనా నుంచి ​తిరిగి వచ్చిన తర్వాత.. ఎక్స్‌ పెంగ్‌లో చేరేందుకు సిద్దమయ్యాడు. ఆకస్మికంగా యాపిల్‌ కంపెనీకి రిజైన్‌ చేశాడు.దాంతో యాపిల్‌ అనుమానం నిజం అయ్యింది. పోలీసుల జరిపిన విచారణలో జాంగ్ యాపిల్ ల్యాబ్‌ నుండి హార్డ్‌వేర్‌ను దొంగిలించాడని తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగా..యాపిల్‌ ఎలక్ట్రిక్‌ కార్ల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

చదవండి👉 యాపిల్‌ సంచలనం..మార్కెట్‌లోకి స్టీరింగ్‌ లేని ఎలక్ట్రిక్‌ కార్‌, విడుదల ఎప్పుడంటే!

మరిన్ని వార్తలు