1,550 కేజీల గంజాయి స్వాధీనం

28 Aug, 2022 04:37 IST|Sakshi
పట్టుబడిన గంజాయిని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ

విలువ రూ.31 లక్షలు పైనే..

వ్యాన్‌ సీజ్, డ్రైవర్‌ అరెస్ట్‌ 

నక్కపల్లి/నెల్లూరు(క్రైమ్‌): అనకాపల్లి జిల్లాలో రూ.31 లక్షలకు పైగా విలువ చేసే 1,550 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి విజయవాడ మీదుగా తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నారని శనివారం తెల్లవారుజామున సీఐ నారాయణరావు, ఎస్‌ఐ వెంకన్నలకు సమాచారం అందింది. వారు వెంటనే తమ సిబ్బందితో కలిసి కాగిత టోల్‌ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు.

తమిళనాడుకు చెందిన గూడ్స్‌ వ్యాన్‌లో తనిఖీలు చేయగా.. గంజాయి ప్యాకెట్లు లభించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, వ్యాన్‌ను సీజ్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన డ్రైవర్‌ షబ్బీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని శ్యామ్‌రాజ్‌ అనే వ్యక్తికి గంజాయిని అప్పగించేందుకు అనకాపల్లిలో లోడింగ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.  
నెల్లూరులో 62 కేజీల గంజాయి స్వాధీనం  
విజయవాడ నుంచి చెన్నైకి స్కార్పియో వాహనంలో తరలిస్తున్న 62 కేజీల గంజాయిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు, తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ ముత్తుమురుగన్‌ను అరెస్ట్‌ చేశారు.

చెన్నైకి చెందిన కార్తీక్‌ ఆదేశాల మేరకు విజయవాడలోని సత్తిబాబు దగ్గర నుంచి గంజాయి తీసుకెళుతున్నట్టు విచారణలో ముత్తుమురుగన్‌  వెల్లడించారు. గంజాయి విలువ రూ.3.10 లక్షలు ఉంటుందని, ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథరెడ్డి చెప్పారు.  

మరిన్ని వార్తలు