ఏసీబీకి చిక్కిన రెవెన్యూ సిబ్బంది 

26 Jan, 2021 10:59 IST|Sakshi
అధికారులకు చిక్కిన సర్వేయర్‌ భాగ్యవతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కుమార్

సాక్షి, రంగారెడ్డి: ఏసీబీ అధికారులు సర్వేయర్‌తోపాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను వలపన్ని పట్టుకున్నారు. భూ సర్వే రిపోర్టు కోసం సర్వేయర్‌ డబ్బులు డిమాండ్‌ చేశారు. రూ. 3 వేలు తీసుకుంటుండగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. అనంతరం సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన దోమ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఐనాపూర్‌కు సయ్యద్‌ ఖాజా యాదుల్లా హుస్సేని తాను కొనుగోలు చేసిన సర్వేనంబర్‌ 445లో ఉన్న 3 ఎకరాల భూమిని సర్వే చేయాలని 2018లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి సర్వేయర్‌ భాగ్యవతిని అడుగగా.. మళ్లీ దరఖాస్తు చేసుకొని రావాలని సూచించారు. దీంతో బాధితుడు 2019లో మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయానికి పలుమార్లు తిరుగగా గత ఏడాది డిసెంబర్‌ 7న సర్వేకోసం ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు ఇవ్వాలని ఆయనకు అందజేసింది. దీంతో యాదుల్లా హుస్సేని కావలికార్‌ సాయంతో చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చాడు.  

రూ. 10 వేలు డిమాండ్‌ 
డిసెంబర్‌ 15న సర్వే చేసిన సర్వేయర్‌ భాగ్యవతి రూ.10 వేల లంచం అడిగారు. బాధితుడు తాను అంత ఇచ్చుకోలేనని చెప్పి రూ. 2,000 ఇచ్చాడు. అనంతరం సర్వే రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్‌ భాగ్యవతి.. యాదుల్లా హుస్సేన్‌ను సతాయించింది. చివరకు రూ. 3 వేలు ఇస్తానని అతడు అంగీకరించాడు. దీంతో బాధితుడు ఈనెల 18న యాదుల్లా హుస్సేని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు శనివారం పథకం ప్రకారం దాడులు చేసేందుకు సిద్ధమవగా ఆమె విధులకు హాజరు కాలేదు. దీంతో సోమవారం బాధితుడు కార్యాలయానికి వచ్చి సర్వేయర్‌కు ఫోన్‌ చేశాడు. తాను ఫీల్డ్‌లో ఉన్నానని.. రావడానికి సమయం పడుతుందని, తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌కు డబ్బులు ఇవ్వమని భాగ్యవతి సూచించారు. దీంతో బాధితుడు కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కుమార్‌కు రూ. 3 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్‌ భాగ్యవతిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.  

మరిన్ని వార్తలు