మైనర్‌పై లైంగిక వేధింపులంటూ కేసు! పాపం ఆ తాత.. భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డాడు

20 Mar, 2022 19:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: పుట్టిన ఊరును కన్నతల్లిగా భావించిన ఆ పెద్దాయన.. ఊరి జనాల సాక్షిగా పడ్డ నిందను భరించలేకపోయాడు. భయపడొద్దని, నిజం నిగ్గుతేలుతుందని ఇంట్లో వాళ్లు ఎంత ధైర్యం నింపినా ఫలితం లేకుండా పోయింది. పరువు పోయిందని, అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన రెట్టింపు అయ్యింది. ఫలితం.. ఆ తాత ప్రాణం తీసింది.

ఢిల్లీ గురుగ్రామ్‌ పరిధిలోని ఓ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని 88 ఏళ్ల లాల్‌సింగ్‌పై అత్యాచార ఆరోపణలు, అదీ ఓ మైనర్‌పై కావడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి పోక్సో చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ సైతం నమోదు చేశారు. దీంతో ఆ వృద్ధుడు కలత చెందాడు. రోజంతా పచ్చి మంచి నీళ్లు ముట్టకుండా ఏడుస్తూనే ఉన్నాడు.  చివరకు.. పరువు పోయిందనే బాధతో గురవారం మధ్యాహ్నాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ దొరకలేదని, కేసు నమోదు అయ్యిందన్న బాధతోనే లాల్‌సింగ్‌ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్టేషన్‌ హెడ్‌ వినీత్‌ కుమార్‌ భావిస్తున్నాడు. ఇక ఈ కేసులో కేసు పెట్టిన మహిళ(మైనర్‌ తల్లి) పోలీసులకు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తన కూతురిపై లాల్‌సింగ్‌ గత కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని, బయటకు చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ కేసు పెట్టింది ఆమె. అయితే లాల్‌ సింగ్‌ గత కొన్నిరోజులు ఆరోగ్యం బాగోలేక కూతురి దగ్గరికి వెళ్లాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమెను గట్టిగా నిలదీయగా, లాల్‌సింగ్‌ కుటుంబంపై పాత గొడవల దృష్ట్యా కోపంతోనే కేసు పెట్టినట్లు ఒప్పుకుంది. పోయిన ప్రాణం ఎలాగూ తిరిగి రాదు కాబట్టి లాల్‌సింగ్‌ కుటుంబం.. ఆ మహిళను క్షమించి వదిలేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు