చేతి పంపు కొడితే బకెట్ల కొద్ది మద్యం.. నివ్వెరపోయిన పోలీసులు

13 Oct, 2022 09:23 IST|Sakshi

భోపాల్‌: ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు రావడం సహజమే. కానీ చేతి పంపులో నుంచి మద్యం రావటం ఎప్పుడైనా చూశారా? అవునండీ.. అది నిజమే. మధ్యప్రదేశ్‌ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలో చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం మేరకు గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కనిపించిన ఈ దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.   

గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ‍్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతిపంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్‌ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.’ అని గునా ఎస్పీ పంకజ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు