రాజస్థాన్ మహిళకు ఆర్ధిక సాయం చేసిన ప్రభుత్వం 

2 Sep, 2023 19:38 IST|Sakshi

జైపూర్: రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసిన సంఘటన విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించామని బాధితురాలి భర్తతో సహా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ సందర్బంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం తోపాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మరువక ముందే రాజస్థాన్‌లో అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధముందని అనుమానించి పది మంది చూస్తుండగా ఆమెను ఒకపక్క కొడుతూ  వివస్త్రను  చేసి నగ్నంగా ఊరేగించాడని తెలిపారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలంతోనే మీనా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. 

సంఘటన వెలుగులోకి రాగానే వీడియో వైరల్ కావడంతో పాటు దీనిపై రాజకీయ రగడ కూడా మొదలవడంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. కేసు విచారణ బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించారు. అనంతరం ప్రతాప్‌గఢ్ వెళ్లి  గర్భవతియైన బాధితురాలిని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. 

ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, ఆమె అవమానకరమైన బాధను గొప్ప తెగువతో భరించింది. ఆమె ఆర్ధిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందజేస్తామని కూడా తెలిపారు.   

ఇది కూడా చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్‌లో సీబీఐ

మరిన్ని వార్తలు