బంజారాహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు: గోప్యత వెనుక అంతుచిక్కని ప్రశ్నలు 

9 Dec, 2021 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకుదెరువు కోసం ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వలస వచ్చిన దేబేంద్రకుమార్‌ దాస్, అయోధ్య రాయ్‌లను మద్యం మత్తులో పొట్టనపెట్టుకున్న బంజారాహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిందితులైన బజార్‌ రోహిత్‌ గౌడ్, వేదుల సాయి సోమన్‌కు రాజకీయ నాయకుల మద్దతు ఉందని ఆది నుంచీ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

వీరికి శ్వాస పరీక్షల చేయడంలో పోలీసులు  నిర్లక్ష్యం వహించడం.. పరోక్షంగా నిందితులకు సహకరించారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోపక్క పూటుగా మద్యం తాగి ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రహదారులపై వీరవిహారం చేసిన ఈ ‘నిషా’చరుల్ని పట్టుకోవడంలో ట్రాఫిక్‌ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.  
 

కొంత ‘కాంప్రమైజ్‌’?.. 

► ఈ కేసు విషయంలో పోలీసుల తీరుతెన్నులు ఆది నుంచీ అనుమానాస్పదంగా మారాయి. కేసు నమోదు విషయంలో మాత్రం పోలీసులు ఏ మాత్రం రాజీ పడలేదు. తీవ్రస్థాయిలో వచ్చిన ఒత్తిళ్లను పక్కన పెట్టి.. కారు నడిపిన రోహిత్‌తో పాటు పక్కన ఉన్న సాయి సోమన్‌ పైనా కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 304 (2), 109లతో పాటు ఎంవీ యాక్ట్‌లోని 185 కింద ఆరోపణలు చేశారు. ఇంత వరకు అంతా సజావుగానే ఉంది.  

    రెయిన్‌బో ఆస్పత్రి వద్ద ప్రమాదం చేసిన నిందితులు అక్కణ్నుంచి రోడ్‌ నం.5లో ఉన్న పద్మావతి నిలయం అపార్ట్‌మెంట్‌ వరకు పారిపోయారు. అక్కడి సెల్లార్‌లో కారును దాచి మళ్లీ మరో ప్రాంతానికి వెళ్లిపోతూ గస్తీ పోలీసులకు చిక్కారు. ఈ ప్రమాదంలో యాక్సిడెంట్‌కు కారణమైన కారు కూడా కీలక ఆధారం. దాన్ని దాచేయడానికి ప్రయత్నించిన వీరిపై ఐపీసీలోని సెక్షన్‌ 201 కింద ఆరోపణలు చేర్చాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. 
 

రీడింగ్‌ ఆలస్యంలో ఆంతర్యమేమిటో?  

 ఈ కేసు కోర్టులో నిరూపితమై నిందితులకు కఠిన శిక్ష పడాలంటే వాళ్లు మద్యం మత్తులో వాహనం నడిపారని నిరూపించడం అత్యంత కీలకం. ఈ విషయంలోనూ పోలీసులు విచారణ సమయంలో నిందితులకు కలిసి వచ్చేలా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. బుధవారం పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూసినా.. రోడ్‌ నం.5లో నిందితులతో పాటు కారును అదుపులోకి తీసుకున్న గస్తీ బృందాలు సోమవారం తెల్లవారుజామున 3.15 గంటలకు బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

అక్కణ్నుంచి నిందితులను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చిన వెంటనే శ్వాస పరీక్ష చేసి ఎంత మోతాదులో మద్యం తాగారో తేల్చాలి. దీన్ని న్యాయస్థానానికి సమర్పించే రికార్డుల్లోనూ పొందుపరచాలి.  

 పోలీసులు మాత్రం నిందితులకు దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా సోమవారం ఉదయం 7.19 గంటలకు శ్వాస పరీక్ష చేసి రోహిత్‌కు బీఏసీ కౌంట్‌ 70, సోమన్‌కు 58 వచ్చినట్లు రికార్డు చేశారు. ఈ కౌంట్‌ 30 లోపు ఉంటే అది ఉల్లంఘన కిందికి రాదు. ఈ కౌంట్‌ అనేది మద్యం తాగిన వ్యక్తి శరీరంలో ప్రతి గంటకూ తగ్గిపోతుంటుంది.

ఈ కౌంట్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత తీవ్రతగా కోర్టు పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా, నిందితులకు పరోక్షంగా కలిసి వచ్చేలా ఆలస్యంగా పరీక్ష చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ప్రతి చోటా తనిఖీలు చేయలేం 
మద్యం తాగి వాహనాలు నడిపే వారితో పాటు హెల్మెట్‌ లేకుండా వాహనం నడపటం తదితర ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ప్రతి ఇల్లు, జంక్షన్లలో రాత్రి వేళ డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేయలేం. ఇవి ఎన్నో ఇబ్బందులకు కారణమవుతాయి. 

– బుధవారం విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ 

ఓ ఎమ్మెల్యే ఠాణాకు వచ్చారు.. 
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సోమవారం ఉదయం బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆయన కేవలం ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాపై ఎలాంటి ఒత్తిడి చేయడానికి ప్రయత్నించలేదు. దర్యాప్తు పక్కాగా చేస్తున్నాం. 

– బుధవారం విలేకరుల సమావేశంలో జేసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌  

చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు

మరిన్ని వార్తలు