అదృశ్యమైన సస్పెండెడ్‌ హోంగార్డ్‌ రామకృష్ణ మృతి.. పరువు హత్య?

17 Apr, 2022 10:30 IST|Sakshi

సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్‌ హోంగార్డు రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే  మృతుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్‌ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వెంకటేష్ రాజపేట మండలం కాలువపల్లిలో వీఆర్వోగా పనిచేస్తుండగా.. రామకృష్ణ హత్య కేసులో మరో హోంగార్డు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లి ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. ఇటీవల రామకృష్ణ తుర్కపల్లి గుప్తా నిధులు కేసులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసకుంటున్నాడు.
చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. భర్తతో గొడవలు.. న్యాయవాది ఆత్మహత్య

ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపించడానికి ఏప్రిల్‌ 15న రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య భార్గవి శనివారం ఉదయం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు