కాళ్లు మొక్కినా కనికరించలే..! వరుసబెట్టి ముగ్గురిని..!

2 Sep, 2021 04:46 IST|Sakshi

అన్నాదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీల చిచ్చు  

విచక్షణ కోల్పోయిన తమ్ముడు రంపం, వేట కొడవళ్లతో అన్న, వదిన, బావమరిది హత్య 

వరంగల్‌లో దారుణఘటన నిందితుడు షఫీని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సాక్షి, వరంగల్‌: డబ్బుల కోసం విచక్షణ కోల్పోయిన ఓ తమ్ముడు.. సొంత అన్న కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ‘మా వాళ్లను చంపకండి బాబాయ్‌... మీకెన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం. వదిలేయండి ప్లీజ్‌’అంటూ అన్న కూతురు కాళ్ల మీద పడి వేడుకున్నా వినలేదు. నిమిషాల వ్యవధిలో అన్న చాంద్‌పాషా(50), వదిన సాబీరా(42), బావమరిది ఖలీల్‌ (40)ని అంతమొందించాడు. ఈ దారుణ ఘటన వరంగల్‌లో కలకలం రేపింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన చాంద్‌పాషాకు షఫీతోపాటు మరో సోదరుడు ఉన్నాడు. చాంద్‌పాషా, షఫీలు పరకాల కేంద్రంగా 20 ఏళ్లుగా పశువులు, గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు.

మూడేళ్ల క్రితం వ్యాపారంలో లెక్కలు చూసుకుంటే రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఈ లెక్కల వ్యవహారాలు షఫీ చూస్తున్నందున వచ్చిన నష్టంలో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్‌పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. తనకు పెద్ద మొత్తంలో కావాలనే అప్పుగా ఇచ్చారని, కట్టలేనని షఫీ మొండికేయడంతో వ్యాపారం చేసేందుకు చాంద్‌పాషా ఒప్పుకోలేదు. దీంతో షఫీ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎల్‌బీనగర్‌లో రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్‌పాషా ఏడాది క్రితం నూతన గృహాన్ని నిర్మించాడు. తనకు అప్పులు వేసి, అన్న డబ్బులు దాచుకొని కొత్త ఇల్లు కట్టుకున్నాడని షఫీ పలుమార్లు స్నేహితులు, బంధువుల వద్ద వాపోయాడు. అప్పులతో ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని అన్నా వదినలను బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో కుటుంబాన్ని మట్టుబెట్టాడు. 

స్నేహితుల సాయంతో..
పథకం ప్రకారం షఫీ స్నేహితులతో కలసి అర్ధరాత్రి వర కు మద్యం సేవించాడు. ఇంటి తలుపులను కోసేందుకు ఎలక్ట్రిక్‌ రంపంతోపాటు వారిని నరికేందుకు పదునైన వేట కొడవళ్లు, కత్తులను తీసుకొని ఆటోలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అన్న ఇంటికి చేరుకున్నాడు. రంపంతో తలుపులను సగం వరకు కోశాడు. ముగ్గురు ఇంటి బయట పరిసరాలను గమనిస్తుండగా.. షఫీతోపాటు మిగిలినవాళ్లు లోపలికి వెళ్లారు. అలికిడికి నిద్ర లేచిన చాంద్‌పాషా ఎవరు, ఎవరు అంటూ రాగా.. అంతలోనే షఫీ రంపంతో చాతిభాగంలో కోశాడు. ఆ తరువాత పదునైన కత్తితో తలపై నరకడంతోపాటు శరీరంపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు.

అడ్డుకోబోయిన చాంద్‌పాషా బావమరిది ఖలీల్‌ను కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. తర్వాత వదిన సాబీరానూ విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. వేరే గదిలో ఉన్న చాంద్‌పాషా కుమార్తె రూబీనా(23) బయటకు వచ్చి బాబాయ్‌.. అమ్మా, నాన్నలను ఏం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. అడ్డువచ్చిన చాంద్‌పాషా కుమారులు ఫహాద్‌ (28), సమద్‌ (21)లను కొడవలితో పొడవడంతో వారు రక్తస్రావమై కిందపడిపోయారు. తర్వాత 2.35 గంటల ప్రాంతం లో స్నేహితులతో కలిసి షఫీ ఆటోలో తిరిగి వెళ్లిపోయాడు. పైన అద్దెకున్నవారు కిందకు వచ్చే ప్రయత్నం చేయగా... అడ్డొస్తే చంపుతానని బెదిరించారు.  

కాళ్లు మొక్కినా కనికరించలేదు
బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చప్పుడు వచ్చింది. అంతలోనే మా నాన్న ఎవరు.. ఎవరు అంటుండగానే బాబాయ్‌ రంపం, కత్తులతో నాన్నపై దాడి చేశాడు. తర్వాత మామ ఖలీల్‌ను నరికేశాడు. ఇది గమనించిన మా అమ్మ సాబీరా రెండేళ్ల నా బిడ్డను పట్టుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆమెనూ వదల్లేదు. నా పాపను నా చేతిలో పెట్టి మా తల్లిని సైతం కిరాతంగా హతమార్చాడు. బాబాయ్‌ డబ్బులు మొత్తం నాన్నతో ఇప్పిస్తా వదిలేయ్‌ బాబాయ్‌ అని కాళ్లు మొక్కినా వినలేదు. వాడిని చంపేయండి వదిలిపెట్టొద్దు.  – మృతుడి కుమార్తె రూబీనా

వర్షం రాకుంటే..ఇంటికి వచ్చేటోడు.. 
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చాంద్‌పాషా బావమరిది సయ్యద్‌ ఖలీల్‌ వర్షం రాకపోతే ప్రాణాలతో బయటపడేవాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఖలీల్‌ హన్మకొండలోని ఓ మొబైల్‌షాపులో సర్వీస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ ఇంటినుంచి హన్మకొండకు బైక్‌పై వెళ్లి వస్తుంటాడు. ఆలస్యమైనప్పుడు వరంగల్‌లోని తన అక్క ఇంటికి వెళ్లేవాడు. కేసముద్రంలో నూతనంగా మొబైల్‌షాపు పెట్టాలని నిర్ణయించుకున్న ఖలీల్‌ ఆగస్టు 31న తన జాబ్‌కు రాజీనామా చేశాడు. వర్షం వస్తుండటంతో అక్క ఇంటికెళ్లాడు. బావను చంపేందుకు వచ్చిన షఫీని అడ్డుకోబోయిన ఖలీల్‌ కూడా హత్యకు గురయ్యాడు. వర్షం రావడంతో ఖలీల్‌ అక్క ఇంటికెళ్లాడని, లేకుంటే ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెప్పారు.

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అదుపులోకి... 
షఫీ వెళ్లిపోగానే ఆ ఇంట్లో అద్దెకున్న అజీమ్‌ కిందకు వచ్చి కార్పొరేటర్‌ పుర్కాన్‌కు సమాచారమివ్వగా ఆయన అక్కడికొచ్చారు. 3.40 గంటల ప్రాంతంలో డయల్‌ 100కు కాల్‌ చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న సమద్, ఫహాద్‌లను అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 4.05 గంటల ప్రాంతంలో నైట్‌ పెట్రోలింగ్‌లో ఉన్న మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ గణేష్‌ ఘటనాస్థలికి రాగా, తర్వాత వరంగల్‌ ఏసీపీ కె.గిరిధర్, పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి వచ్చారు. నిందితులు ఇంటిబయట ఓ సంచిలో వదిలిపెట్టిన కత్తులను, రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల సహాయంతోపాటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా షఫీతోపాటు మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. రూబీనా ఫిర్యాదుమేరకు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, షఫీపై 2010లో మట్టెవాడ ఠాణాలో అక్రమ ఆయుధాల సరఫరా కేసు నమోదైంది. దాడి ఘటనలో వరంగల్, పరకాల, నర్సంపేట ప్రాంతాలకు చెందిన షఫీ దగ్గరి మిత్రులు పాలుపంచుకున్నట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు