‘నంబర్‌ వన్‌’ టార్గెట్టే ముంచిందా!

27 Sep, 2021 04:35 IST|Sakshi

వాటి నిర్వహణకు రూ.250 కోట్లకు పైగా వెచ్చింపు 

కార్వీ కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలకాంశాలు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో కార్వీనే పైన ఉండాలి.. స్టాక్‌ బ్రోకింగ్‌లో తన సంస్థే వాటానే ఎక్కువగా ఉండాలి.. ఇలా నంబర్‌ వన్‌ స్థానం కోసం పోటీపడిన కార్వీ సంస్థల సీఎండీ సి.పార్థసారథి నిండా మునిగారు. బ్యాంకుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిటీ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ అధికారులు అనేక కీలక విషయాలు గుర్తించారు.  

కొసరు కోసం అసలు డబ్బు... 
స్టాక్‌ బ్రోకింగ్, డేటా మేనేజ్‌మెంట్‌ రంగాల్లో కార్వీకి ప్రత్యేక స్థానం ఉండేది. భారీ వ్యాపార సామ్రాజ్యం స్థాపించాలని, తనదో పెద్ద గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీగా మారాలని భావించిన పార్థసారథి అనుబంధ సంస్థల్ని స్థాపించారు. దాదాపు 20కి పైగా కంపెనీలను ఏర్పాటు చేశారు. వీటికి మౌలిక వసతులు, ఇతరాల కోసం కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) నుంచి రూ.250 కోట్లు వెచ్చించారు.

ఆ సంస్థలు ఆశించిన స్థాయిలో టర్నోవర్‌ సాధించలేకపోవడం, కార్వీ రియాల్టీ సంస్థ మహేశ్వరంలో నోవా ప్రాజెక్ట్స్‌ పేరుతో చేసిన 250 ఎకరాల వెంచర్‌లోనూ లాభాలు రాకపోవడంతో తీవ్రనష్టాల్లో మునిగిపోయారు. ఆయా సంస్థలకు అవసరమైన రుణాలు తీసుకోవడానికి కార్వీ ఆస్తులను గ్యారెంటీగా పెట్టారు. 

అతి పెద్ద బ్రోకింగ్‌ సంస్థగా మారాలని... 
గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్‌.. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ), ది సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్‌ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. జాతీయ స్థాయిలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో జరిగే ట్రేడింగ్‌లో కార్వీ వాటా 2శాతంగా ఉండేది. దీన్ని 7శాతానికి పెంచడం ద్వారా దేశంలోనే అతిపెద్ద బ్రోకింగ్‌ సంస్థగా అవతరించాలని పార్థసారథి భావించారు.

దీనికోసం భారీ టర్నోవర్‌ సృష్టించడానికి ప్రయత్నించారు. తమ వద్ద ఉన్న డీమ్యాట్‌ ఖాతాల్లో మదుపరుల ప్రమేయం లేకుండా ట్రేడింగ్‌ చేయించారు. ఇలా కార్వీ ట్రేడింగ్‌ వాటా 6శాతానికి చేరాక ప్లాన్‌ బెడిసికొట్టింది. షేర్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో రూ.400 కోట్లకు వరకు నష్టాలు వచ్చాయి.   

కోవిడ్‌ నేపథ్యంలో కంపెనీలు విక్రయించలేక..
ఈ నష్టాల నుంచి బయటపడటానికి మదుపరుల షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందాలని భావించిన పార్థసారథి దానికోసం వారి అనుమతి లేకుండా వారి డీమ్యాట్‌ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆ షేర్లను తనఖా పెట్టి రూ.1,100 కోట్ల వరకు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి అప్పు తీసుకున్నారు. కాలక్రమంలో తన కంపెనీలకు విక్రయిం చి బ్యాంకులకు చెల్లించడం ద్వారా బయటపడాలని భావించారు. అయితే కోవిడ్‌తో మార్కెట్‌ కుప్పకూలడం పార్థసారథికి ప్రతికూలంగా మారింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు