సైబర్‌ నేరగాళ్ల వల.. ఒకే రోజు ఐదుగురి వద్ద నుంచి..

29 Jul, 2021 11:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): నగరంలో ప్రతిరోజూ ఆన్‌లైన్‌ వేదికగా మోసాలు జరుగుతున్నాయని తెలుస్తున్నా.. కొందరు మాత్రం ఆన్‌లైన్‌ కేటుగాళ్లు విసిరే వలలకు ఇట్టే పడిపోతున్నారు. బుధవారం ఐదు కేసుల్లో అక్షరాల రూ.12,69,988 లక్షలను పోగొట్టుకున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాధితులు సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎన్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. 

సర్జికల్‌ ఐటెంస్‌తో పంపుతానంటూ..
తార్నాకకు చెందిన విజయ్‌కుమార్‌కు మెడికల్‌ షాప్‌ ఉంది. హ్యాండ్‌ గ్లౌజెస్, ఇతర సర్జికల్‌ ఐటెంస్‌ కావాలంటూ గూగుల్‌ సెర్చ్‌ చేశాడు. అందులో కనిపించిన ఓ నంబర్‌కు ఫోన్‌ చేసి అడగ్గా.. విజయ్‌కుమార్‌ ఇచ్చిన లిస్టులో ఉన్న అన్నీంటినీ పంపిస్తానన్నాడు. ఇందుకు గాను రూ.3,57,500 లక్షలను పంపాలనడంతో అకౌంట్లలో వేశాడు. రోజులు గడచినా సర్జికల్‌ ఐటెంస్‌ రావకపోవడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మొబైల్‌ యాక్ససిరీస్‌ పేరుతో...
మొబైల్‌ షాపు యజమానైన గోవిందరావు మొబైల్‌ యాక్ససిరీస్‌ కావాలంటూ గూగుల్‌ ద్వారా ఓ వ్యక్తిని సంప్రదించాడు. తొలుత రూ.50వేల ఐటెంస్‌ను కావాలనడంతో.. ఆ డబ్బును ముందుగానే పంపాడు. డబ్బుకు సరిపడా ఐటెంస్‌ అన్నీంటినీ నిర్ణిత సమయంలో గోవిందరావుకు పంపాడు. ఆ తర్వాత ఒకేసారి బల్క్‌లో ఎక్కువ ఐటెంస్‌ను బుక్‌ చేశాడు. వీటికి గాను రూ.3.48లక్షలు అవుతాయనడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా యాక్ససిరీస్‌ అందలేదు. దీంతో అనుమానం వచ్చిన గోవిందరావు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

హల్దీరామ్‌ డీలర్‌షిప్‌ నీకేనంటూ...
వ్యాపారంపై మక్కువ ఉన్న చిక్కడపల్లి వాసి ఆర్సీజైన్‌ ఆన్‌లైన్‌ వేదికగా వ్యాపార మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో హల్దీరామ్‌కు సంబంధించి ఓ నంబర్‌ దొరకగా ఆ వ్యక్తిని సంప్రదించాడు. చిక్కడపల్లి ప్రాంతానికి సంబంధించి హల్దీరామ్‌ డీలర్‌షిప్‌ నీకే ఇస్తానంటూ నమ్మబలికాడు. ఇందుకు గాను రూ.3.24లక్షలు చెల్లించాలనడంతో ఆ మొత్తాన్ని పంపాడు. ఆ తర్వాత డీలర్‌షిప్‌ ఇవ్వకపోగా.. ఇచ్చిన డబ్బులను సైతం వెనక్కి ఇవ్వడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

విస్తర ఎయిర్‌లైన్‌ పేరుతో...
ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ అయిన విస్తర పేరుతో ఓ వ్యక్తి నగర వాసికి టోకరా వేశాడు. వారసిగూడకు చెందిన వాణీశ్వర్‌ తన రెసూమ్‌ను క్విక్కర్, మోనిస్టర్‌ సైట్లలో పెట్టాడు. రెసూమ్‌ని చూసిన ఓ వ్యక్తి “తాను విస్తర ఎయిర్‌ లైన్స్‌ను నుంచి మాట్లాడుతున్నానని, టికెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు మీరు ఎంపికయ్యారని చెప్పాడు. ప్రాసెసింగ్‌ ఫీజు, తదితర వాటికి గాను రూ.1,94,600 లక్షలను తీసుకున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోగా.. తప్పించుకోవడంతో మోసపోయానని గ్రహించి వాణీశ్వర్‌ బుధవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఎస్‌బీఐ కేవైసీ పేరుతో...
ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ హిమాయత్‌నగర్‌ వాసి పంకజ్‌మహత్‌ను మోసం చేశాడో సైబర్‌ నేరగాడు. మీ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ అప్‌డేట్‌ చేయమంటూ లింక్‌ పంపాడు. ఆ లింక్‌ ఓపెన్‌ చేసిన పంకజ్‌మహత్‌ బ్యాంకు వివరాలన్నీ నమోదు చేశాడు. అంతే క్షణాల్లో డెబిట్‌ కార్డు నుంచి రూ.20వేలు, నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి రూ.25వేల చొప్పున మొత్తం రూ.45వేలు లూటీ చేశారు. దీంతో బాధితుడు బుధవారం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్రైం ఇన్‌స్పెక్టర్‌ ముత్తినేని రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు