కానుక, కారు అనేసరికి నమ్మింది.. ఆ తర్వాత పని పూర్తి కాగానే..

29 Jul, 2022 13:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: చుట్టూ ఎన్నో సైబర్‌ మోసాలు జరుగుతున్నా కొందరు మేలుకోవడం లేదు. ఉత్తుత్తి మెసేజ్‌లకు స్పందించి బోల్తా పడుతున్నారు. సులభంగా డబ్బులు వస్తాయని మోసగాళ్ల వలలో పడిన ఇద్దరు మహిళలు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితులు మైసూరు రాఘవేంద్ర నగరలో ఉండే ఎం.ఆర్‌. రూపా (42), చాముండిపురవాసి శృతి (27).  రూపా మొబైల్‌కు కేబిసీ పేరుతో మీకు బహుమానం వచ్చిందని మెసెజ్‌ వచ్చింది. ఆ లింక్‌ను నొక్కి వివరాలను నమోదు చేసింది.

రెండు రోజుల తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.6.40 లక్షలు ఇతర ఖాతాల్లోకి బదిలీ అయ్యింది.  కారు వస్తుందని శృతి మొబైల్‌కి కారు లాటరీ తగిలినట్లు మెసేజ్‌ వచ్చింది. ఆమె మెసేజ్‌లోని లింక్‌ను ఓపెన్‌ చేయగా వరుసగా నాలుగైదు సందేశాలు వచ్చాయి. కారు మీద జీఎస్‌టీ, బీమా కలిసి మొత్తం రూ.2 లక్షల 22 వేలు చెల్లించాలని చెప్పడంతో ఆమె డబ్బు పంపింది. ఆ తరువాత ఆ ఫోన్‌ నంబర్‌ స్విచ్చాఫ్‌ అయ్యింది. డబ్బులు పోయాయని గుర్తించిన బాధితులు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కరెంటు బిల్లు కట్టాలని రూ.99 వేలు  
మైసూరు రామకృష్ణ నగరలో ఉండే శ్రీనివాసరావు (59) మొబైల్‌కు గడిచిన నెల విద్యుత్‌ బిల్లు కట్టలేదని మెసెజ్‌ వచ్చింది. ఆ నంబర్‌కు బాధితుడు కాల్‌ చేశాడు. మీ ఫోన్‌లో ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వంచకులు ఆయనకు చెప్పగా అలాగే చేశాడు. తరువాత రూ.20 కట్టాలనడంతో పంపాడు. యాప్‌ ద్వారా ఆయన బ్యాంక్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన దుండగులు రూ.99 వేలను లూటీ చేశారు. ఇతడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చదవండి: చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిన మహిళ

మరిన్ని వార్తలు