సుశీల్‌ కుమార్‌ ఎక్కడ?

11 May, 2021 03:47 IST|Sakshi

‘లుక్‌ అవుట్‌’ నోటీసు జారీ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్‌ కుమార్‌ పరారీ వ్యవహారం సీరియస్‌గా మారింది. యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్‌పై ఢిల్లీ పోలీసులు ‘లుక్‌ అవుట్‌’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్‌ అవుట్‌’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో సుశీల్‌ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు.

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్‌ కోసం వెతికామని వెల్లడించారు.   ఈ ఘటనలో బాధితుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్‌ స్టేడియం పార్కింగ్‌ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్‌ చాంపియన్‌ సాగర్‌ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్‌ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు.  

రెజ్లింగ్‌ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్‌ఐ
రెండు ఒలింపిక్‌ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్‌ కుమార్‌ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్‌ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్‌ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్‌కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్‌ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్‌ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు