వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు

Published Tue, Dec 19 2023 2:50 AM

తెల్లవారుజామున స్వామివారికి తీర్థపు బిందె తీసుకువెళుతున్న అర్చకుడు  - Sakshi

బిక్కవోలు : స్థానిక ప్రాచీన శ్రీ గోలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్ఠ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌ జంగావీర వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు తెల్లవారు జామున 1.20 గంటలకు తీర్థపు బిందె సేవతో ప్రారంభమయ్యాయి. స్వామికి నిత్య పూజల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లో బారులు తీరారు. గోదావరి కాలువలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆచారం, దీంతో స్నానఘట్టాలన్నీ జనంతో నిండిపోయాయి. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే ఈ స్వామి ఆలయంలోని పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిదురిస్తే స్వామివారు కలలో సాక్షాత్కరించి సంతానాన్ని ప్రసాదిస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. దీంతో సంతానం లేని వారు అధిక సంఖ్యలో ఆలయం వెనుక నాగులు చీర ధరించి నిదురించారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామి వారికి నెమలి వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్‌ మేళాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీరు, చిన్నారులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు, పులిహోర పంపిణీ చేశారు. షిర్డీ సాయి సేవాసమితి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు బాణసంచా కాల్పులు తిలకించడానికి ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం బ్యాండ్‌ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాలు, గారడీలతో రాత్రి 11గంటలకు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జాము వరకు బాణసంచా కాల్పుల పోటీలు సాగాయి. ఈ పోటీలను తిలకించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. షష్ఠి సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు, జిల్లా మహిళ స్థాయి సంక్షేమ సంఘం చైర్మన్‌ రొంగల పద్మావతి, బిక్కవోలు ఉపసర్పంచ్‌ డాక్టర్‌ మురళీకృష్ణారెడ్డి ఉన్నారు.

బిక్కవోలుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ,

ఎమ్మెల్యే దంపతులు

కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
1/3

కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

సంతానం కోసం నాగుల చీర ధరించి 
ఆలయ ప్రాంగణంలో నిదురించిన మహిళలు
2/3

సంతానం కోసం నాగుల చీర ధరించి ఆలయ ప్రాంగణంలో నిదురించిన మహిళలు

బిక్కవోలులో స్వామి దర్శనం కోసం క్యూ లో ఉన్న భక్తులు
3/3

బిక్కవోలులో స్వామి దర్శనం కోసం క్యూ లో ఉన్న భక్తులు

Advertisement
Advertisement