శివశంకర్‌ను లోతుగా విచారించాలి

8 Oct, 2020 03:41 IST|Sakshi

ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్‌ సీఎం విజయన్‌కు తెలుసు

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జిషీటు

కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్‌ కేసులో సస్పెండైన ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాజీ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ ఎం శివశంకర్‌ను మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వెల్లడించింది. స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్‌కు ఒక జాతీయ బ్యాంక్‌లో లాకర్‌ సౌకర్యం లభించేందుకు శివశంకర్‌ సహకరించాడని పేర్కొంది. స్మగ్లింగ్‌ ద్వారా పొందిన లాభాలను ఈ లాకర్‌లోనే స్వప్న సురేశ్‌ దాచేవారని ఈడీ తెలిపింది. పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో బుధవారం నగదు అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో మధ్యంతర చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. అందులో స్వప్న సురేశ్, సరిత్‌ పీఎస్, సందీప్‌ నాయర్‌లను ప్రధాన నిందితులుగా చేర్చింది.

శివశంకర్‌కు దగ్గర అయినందువల్లనే ప్రభుత్వ స్పేస్‌పార్క్‌ ప్రాజెక్ట్‌లో తాను సెలెక్ట్‌ కాగలిగానని స్వప్న సురేశ్‌ అంగీకరించారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. తన అపాయింట్‌మెంట్‌ విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలుసని కూడా ఆమె ఒప్పుకున్నారంది. అయితే, ఈ విషయాన్ని సీఎం విజయన్‌ పలుమార్లు ఖండించారు. సీఎం విజయన్‌ సమక్షంలోనే శివశంకర్‌ను స్వప్న పలుమార్లు కలిశారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. తన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వేణుగోపాల్‌తో కలిపి స్వప్నకు బ్యాంకులో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయించానని ఆగస్ట్‌ 12, ఆగస్ట్‌ 15 తేదీల్లో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌ ఒప్పుకున్నారని తెలిపింది.

స్వప్న సురేశ్‌ దగ్గరున్న డబ్బుల నిర్వహణకు గానూ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వేణుగోపాల్‌ను ఆమెకు శివశంకర్‌ పరిచయం చేశారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే, స్వప్న సురేశ్‌ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న విషయం తనకు తెలియదని విచారణ సందర్భంగా శివశంకర్‌ చెప్పారని ఈడీ పేర్కొంది. బంగారం స్మగ్లింగ్‌లో స్వప్న సురేశ్‌ స్వయంగా పాల్గొనేవారని, తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శివశంకర్‌ను లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. ‘2019 ఆగస్ట్‌లో యూఏఈ కాన్సులేట్‌లో ఉద్యోగాన్ని స్వప్న సురేశ్‌ వదిలేశారు. ఆ తరువాత తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా సీఎం విజయన్‌ వద్ద ప్రిన్స్‌పల్‌ సెక్రటరీగా ఉన్న శివశంకర్‌ను కోరారు. దాంతో,  కేరళ స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన స్పేస్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌లో శివశంకర్‌ ఆమెకు ఉద్యోగం ఇప్పించారు’ అని ఈడీ తెలిపింది.

మరిన్ని వార్తలు