కొత్తరకం మోసం: ఆధార్‌కు రూ.200.. పాన్‌కు రూ.500

21 Jun, 2021 13:27 IST|Sakshi

డబ్బులు ఎరచూపి పేదల ఆధార్, పాన్‌ నంబర్ల సేకరణ 

రమ్మీ ఆడే వారికి సిమ్‌ కార్డుల జారీ 

డిస్ట్రిబ్యూటర్‌ కుట్రను భగ్నం చేసిన పోలీసులు  

పెదగంట్యాడ(గాజువాక): ఆధార్‌ కార్డు ఉందా.. ఆ నంబరు చెప్పండి.. ఇక్కడ వేలి ముద్ర వేయండి.. ఇదిగో తీసుకోండి రూ.200.. పాన్‌ కార్డు ఉందా అయితే దీనికి ఇవిగో రూ.500 అంటూ కొంతమంది వ్యక్తులు కొత్తరకం మోసానికి తెరతీశారు.. అంతేకాకుండా పేదలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి.. వారి పేరుతో సిమ్‌ కార్డులు విక్రయానికి పథకం పన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి హార్బర్‌ ఏసీపీ శ్రీరాముల శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాంబిల్లి మండలానికి చెందిన కొవిరి జగన్నాథం, జానకి రామిరెడ్డి, బండియ్య, కొవిరి నాని అనే నలుగురు వ్యక్తులు శనివారం మండలంలోని వికాస్‌నగర్‌ సెంటర్, బీసీ రోడ్డుకు ఆనుకొని ఉన్న కమ్మలపాకల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామంటూ పేదలను నమ్మబలికారు.

ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు ఉన్న వారి వివరాలు సేకరించి, వారితో వేలిముద్ర వేయించి వారికి డబ్బులు ఇవ్వడం మండలంలో సంచలనమైంది. కొవిరి నాని అనే వ్యక్తి కొత్తపట్నంలో సెల్‌ షాప్‌ నడుపుతున్నాడు. అతను ఓ ప్రయివేటు కంపెనీ సిమ్‌కార్డులను డిస్ట్రిబ్యూట్‌ చేస్తుంటాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొత్తరకం మోసానికి తెరలేపాడు. ఇందుకు మరో ముగ్గురితో కలిసి పేదలకు డబ్బులు ఇప్పించి.. వారి ఆధార్, పాన్‌ కార్డుల ద్వారా సిమ్‌కార్డులను ఎక్కువధరకు అమ్ముకునేలా పథకం రచించాడు.

ఆ సిమ్‌లను ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌ ఆడుకునే వారికి అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ఆధార్‌ వివరాలు సేకరించి డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కొంతమంది వ్యక్తులు అది మోసం అని గ్రహించి వెంటనే 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే న్యూపోర్టు పోలీసులు వారు ఉన్న స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే నలుగురిలో ముగ్గురు పరారయ్యారు. కొవిరి జగన్నాథంను శనివారం అదుపులోకి తీసుకున్నారు.  జానకి రామిరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యూపోర్టు సీఐ ఎస్‌.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: బంజారాహిల్స్‌: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో..

మరిన్ని వార్తలు